Teachers Day:జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు గురువు..!!
శ్రీ గురుభోనమ:
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
మాతృదేవోభవ
పితృదేవోభవ
ఆచార్య దేవోభవ
మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత అక్షరాలుదిద్దించిన గురువుకే పెద్దపీట మన సనాతన భారతీయ సంస్కృతి వేసింది. గురువును సాక్షాత్తూ దేవుడితో సమానంగా పూజించింది.. పూజిస్తోంది. నేటి బాలలే.. రేపటి పౌరులు. ఆ పౌరులను బాధ్యతాయుత వ్యక్తులుగా.. బంగారు భవిష్యత్తుకు మార్గనిర్దేశకులుగా.. ప్రగతి రథ సారధులుగా నిలిపేవారే.. ఉపాధ్యాయులు. అందుకే శతాబ్దాల నాటి గురుకులాలైనా.. ఆన్‌లైన్ పాఠాల సంస్కృతి పెరుగుతున్న నేటి ఆధునిక యుగంలోనైనా.. బోధన ఒక పవిత్రమైన వృత్తిగా భాసిల్లుతోంది.
టీచర్స్ అంటే సమాజంలో గౌరవం ఇనుమడిస్తోంది. ఉపాధ్యాయుడు మొత్తం సమాజానికి బాధ్యత వహిస్తాడు. బాలబాలికలను భావిపౌరులుగా తీర్చిదిద్దే బృహత్తర బాధ్యత ఉపాధ్యాయుడిపై ఉంది. అందుకే ఈ వృత్తి మనసా, వాచా, కర్మణా పవిత్రమైనది. ఆదియుగం నుంచి ఆధునికయుగం వరకు ఆయనే ఋషి.. జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు... సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు.. ఆయనెవరో కాదు మనందరికీ విద్యా బుద్ధులు నేర్పే గురువు. అందుకే మన సమాజంలో అమ్మానాన్నల తర్వాత స్థానం గురువులకు ఇచ్చారు.

గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః
గురుర్దేవో మహేశ్వరః
గురు స్సాక్షాత్పర బ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః
శిశువును లోకానికి పరిచయం చేసిన అమ్మ మొదటి గురువైతే, గుండెలపై తన్నుతూ ఆటలాడే శిశువుకు నడక నేర్పే నాన్న రెండో గురువు. ఆ తర్వాత ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి, విద్యా బుద్ధులు అందించే ఉపాధ్యాయుడు మూడో గురువు. అందుకే పెద్దలు మాతృదేవో భవ.. పితృదేవో భవ.. ఆచార్య దేవోభవ అని అన్నారు. ఇంతటి ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి, గురువు జాతి గౌరవాన్ని లోకానికి చాటి చెప్పిన మన దేశ రెండో రాష్ట్రపతి, మేధావి, విద్యావేత్త అయిన డాక్టర్ సర్వేపల్లి రాధకృష్ణ జయంతిని ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించింది.
ప్రతి యేటా సెప్టెంబర్ 5 న గురువులను సన్మానించుకునే అవకాశాన్ని ఇచ్చింది. విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించేవారే గురువులు. భారత రత్న, భారతదేశ తొలి ఉప రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. రాధాకృష్ణన్ 1888 లో తిరుత్తనిలో జన్మించారు. కేంద్ర ప్రభుత్వం రాధాకృష్ణన్ పుట్టిన రోజును 1962 నుంచి ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణించి గౌరవిస్తోంది.
భారతదేశంలో ఆనాడు ఉన్న మత, ఆధ్యాత్మిక పునరుద్ధరణ వాదాన్ని అకడమిక్ తాత్విక స్థాయికి తీసుకువెళ్లిన గొప్ప పండితుడు సర్వేపల్లి. ఆయన 15 సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి, 11 సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. మహాభారత కాలం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడిని సిసలైన గురుశిష్య సంబంధానికి ప్రతీకలుగా కొలుస్తున్నాం.
సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మా గాంధీ కీర్తించారు. 'మీరు నా కృష్ణుడు, నేను అర్జునుడిని' అన్నారు గాంధీజీ. 'మీరు నా ఉపాధ్యాయుడు' అని కీర్తించారు పండిట్ నెహ్రూ. బహుశా ఈ వ్యాఖ్యల నేపథ్యం నుంచే ఆయన పుట్టిన రోజును టీచర్స్ డేగా నిర్వహించాలనే ఆలోచన పుట్టిందేమో..? గురువులకే గురువు సర్వేపల్లి.. ఆయన జీవితం ఓ స్ఫూర్తి పాఠం.
తరతరాలుగా, యుగయుగాలుగా సనాతన భారతీయత, సంస్కారం మొదలగు పరమార్థ విషయాల్ని ప్రపంచానికి సూటిగా సులభంగా, స్పష్టంగా తెలియజెప్పిన ధీమంతుడు, ధీశాలి సర్వేపల్లి. హృదయాన్ని మేధను సమపాళ్లలో పండించిన ప్రజ్ఞాశాలి ఆయన. తత్వశాస్త్రానికి సాహిత్య మాధుర్యం చేకూర్చిన మహా రచయిత రాధాకృష్ణన్. ఆధునిక సమాజానికి ఎలాంటి గురువు అవసరమో, గురువు ఎలా ఉండాలో ఆయన స్వీయచరిత్రలో స్పష్టంగా వివరించారు.
సనాతన ధర్మాన్ని పరంపరాగతంగా పరిరక్షిస్తున్న ఆ గురుదేవులను స్మరించుకుంటూ.. నేటి పిల్లలను పావన నవజీవన బృందావన నిర్మాతలుగా.. రాబోవు తరం దూతలుగా తీర్చిదిద్దడానికి ఘనమైన అడుగులు వేయించేది ఉపాధ్యాయుడే .. గురువులందరికీ శిరస్సువంచి వినమ్రంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.












Click it and Unblock the Notifications