నేడు అత్యంత శక్తివంతమైన కార్తీకమాస సంకష్టహర చతుర్ధి.. ఇలా చేస్తే అన్నీ విజయాలే!!
కష్టాలు కడ తీర్చే సంకష్టహర చతుర్థి నేడు. ప్రతి మాసంలోని కృష్ణ పక్షంలో అనగా పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగో రోజును సంకష్టహర చతుర్థి అంటారు. ఆరోజు గణపతిని ఆరాధన చేస్తారు. జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను తొలగించి మనల్ని విజయపథంలో నడిపించడం కోసం చతుర్థి నాడు గణపతిని పూజించిన వారికి విజయం వరిస్తుందని చాలామంది బలంగా నమ్ముతారు.
జీవితంలో అడుగడుగునా విఘ్నాలు కలుగుతూ, అశాంతి తో పాటు, మానసిక, శారీరక రుగ్మతలు కలుగుతున్నప్పుడు, రుణ బాధలతో పాటు అనేక కష్టాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు, ఆ కష్టాలన్నీ తొలగిపోవడానికి సంకష్టహర చతుర్థి నాడు పూజ చేయాలి. అప్పుడు సంతోషం కలగడంతో పాటు కార్య జయం కూడా కలుగుతుందని చెబుతారు.

ఎవరైనా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని కనీసం మూడుసార్లు ఆచరించాలి. మూడుసార్లు కానీ, ఐదు సార్లు కానీ, 7, 9, 11, 21 సార్లు కానీ ఆచరించవచ్చు. కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి కి చాలా ప్రాధాన్యత, అమితమైన శక్తి ఉంటుంది. ఇక నేడు ఉదయమే తల స్నానం చేసి, గణపతిని అత్యంత భక్తితో పూజించాలి.
మనసులో కోరికను తలచుకొని మూడు గుప్పెళ్ళు బియ్యాన్ని ఎర్రని వస్త్రంలో ఉంచి, తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు ఎండు వక్కలు, దక్షిణ పెట్టి మూట కట్టాలి. ఆ మూటను వినాయకుడు ముందు పెట్టి ధూప, దీపాలను వెలిగించి, కొబ్బరికాయ, పండ్లు సమర్పించాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి వినాయకుడు విజయాలను అందిస్తారు.
అంతేకాదు సంకష్టహర చతుర్థి వ్రత కథను చదవాలి. తర్వాత స్వామికి కర్పూర నీరాజనం సమర్పించి, తదుపరి వీలుంటే సమీపంలోని వినాయకుడి ఆలయానికి వెళ్లి మూడుసార్లు లేదా 11 సార్లు లేదా 21 సార్లు ప్రదక్షిణలు చేయాలి. సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపరాదు. సూర్యుడు అస్తమించిన తర్వాత మళ్ళీ స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడిని పూజించాలి. నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి, స్వామికి నివేదించి, ఆపై ప్రసాదంగా తీసుకోవాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications