
Vastu tips: వాస్తుశాస్త్రం ప్రకారం కొనకూడని స్థలాలివే.. అవి కొన్నారా.. కష్టాలు కొని తెచ్చుకున్నట్టే!!
వాస్తు శాస్త్రం ప్రకారం గృహ నిర్మాణం ఉంటే ఆ ఇంట్లో సుఖ శాంతులు ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. ఇంటి నిర్మాణంలో ప్రతికూల మరియు సానుకూల శక్తుల మధ్య సమతుల్యతను కొనసాగించే కళగా వాస్తు శాస్త్రాన్ని పేర్కొన్నారు. వాస్తుకు అనుకూలంగా గృహ నిర్మాణాన్ని చేయాలని ఖచ్చితమైన నియమాలు లేకపోయినప్పటికీ, వాస్తుకు అనుకూలంగా నిర్మించుకుంటే సానుకూల ఫలితాలను పొందుతారని వాస్తు శాస్త్రం చెబుతోంది. పంచ భూతాలకు ప్రాముఖ్యతనిస్తూ వాస్తు శాస్త్రం నిర్మాణ సూత్రాలను సూచించింది.

వాస్తు శాస్త్రం ప్రకారం కొనుగోలు చెయ్యకూడని స్థలాలివే
ఇక వాస్తు ప్రకారం కొనకూడదు అని చెప్పబడే స్థలాల వివరాల్లోకి వెళితే ఈశాన్యం తగ్గిన స్థలములను కొనకూడదు. ఇటువంటి స్థలాలలో నివసించేవారికి ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. ఈశాన్యం తగ్గిన స్థలాలను కొనుగోలు చేసిన వారి ఇళ్ళల్లో వంశాభివృద్ధి క్షీణిస్తుంది. సమాజ గౌరవాన్ని కోల్పోవటం జరుగుతుందని వాస్తు శాస్త్రం చెప్తుంది.
ఇక అదే విధంగా స్థలానికి తూర్పు, ఉత్తర దిక్కులలో వేరే వారి స్థలాలు ఉంటే, వారి స్థలాలలోని నీళ్లు మన స్థలంలోకి పారకుండా చూసుకోవాలి. అంటే మన స్థలం పక్క స్థలం కంటే లోతులో ఉండకుండా చూసుకోవాలి .ఇలా ఇతరుల స్థలం మన స్థలంలోకి పారే విధంగా ఉంటే ఇటువంటి స్థలం నివసించటానికి మంచిది కాదు.

భాద్రాసనాకార స్థలాలు, చక్రాకార స్థలాలు మంచివి కావు
తూర్పు పడమర లేదా లేదా ఉత్తర దక్షిణం రెండు దిక్కులు సమాన కొలతలు ఉండి మిగిలిన రెండు దిక్కులు విల్లు వలే వంగి ఉండే స్థలములను భద్రాసనాకార స్థలాలు అంటారు. ఈ స్థలాలు కొనుగోలు చేయకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఒకవేళ ఇటువంటి స్థలాలను కొనుగోలు చేస్తే ఈ స్థలాల్లో నివసించేవారికి అన్ని కష్టాలే ఉంటాయని, సుఖ శాంతులు ఉండవని చెబుతున్నారు. తూర్పు పడమర లేదా ఉత్తర దక్షిణం సమాన కొలతలు ఉండి ఆగ్నేయం నైరుతి ఈశాన్యం వాయువ్య దిశలు క్రాస్ గా ఉన్న చక్రాకార స్థలములు కొనడం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

కొన్ని వీధిపోట్లు ఉన్న స్థలాలు మంచివి కావు
అలాగే కొన్ని వీధిపోట్లు ఉన్న స్థలాలను కొనుగోలు చెయ్యటం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. స్థలాలు కొనుగోలు చేసేటప్పుడు ఖచ్చితంగా వాస్తు సరిగా ఉందా లేదా అనేది సరి చూసుకోవాలని, లేదంటే ఇబ్బంది పడవలసి వస్తుందని చెబుతున్నారు. ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం పెరిగి ఉన్న స్థలాలను కొనుగోలు చేయడం మంచిదని వాస్తు శాస్త్రం సూచిస్తుంది.

చతురస్త్రాకార స్థలాలు, వృత్తాకార స్థలాలు మంచివి
తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ హెచ్చుతగ్గులు లేకుండా సమాన కొలతలు కలిగి ఉన్న స్థలమును చతురస్రాకారపు స్థలం అంటారు. ఇటువంటి స్థలం దినదినాభివృద్ధిని పొందుతుందని, ధనధాన్యాలు అభివృద్ధి చెందుతాయని, ఐశ్వర్యాలు కలుగుతాయి అని ఇటువంటి స్థలాలు కొనుగోలు చేయడం మంచిదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే చంద్రబింబం వలే గుండ్రంగా ఉన్న స్థలము వృత్తాకార స్థలం అంటారు. ఈ స్థలాలు కూడా కొనుగోలు చేయడానికి మంచిదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈ స్థలాల్లో నివసించేవారికి ధన ధాన్యాలు, జ్ఞానం, ఆయురారోగ్యాలు అభివృద్ధి చెందుతాయని చెబుతారు.