కోరిన కోరికలను భగవంతుడు నిజంగానే తీరుస్తాడా..?
డా. ఎం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
దేవుడ్ని అనేక మంది అనేక కోరికలు కోరుకుంటారు కదా, అవన్నీ దేవుడు తీరుస్తాడంటారా? అని ఒక అయన ప్రశ్న, అందరూ కోరుకునేవి తీరుస్తాడో లేదో తెలీదు కానీ ఒక కథ చెప్తా విను అని గురువు గారు చెప్పారు.
ఒకానొకప్పుడు ఒక ఋషి ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి వెళ్తున్నారు. ఋషి ఒక మహావృక్షం ముందు ఆగి ప్రసన్నంగా నవ్వుతూ తథాస్తు అన్నాడు. గురువు గారి చర్యకి కారణం ఏంటి అని అడిగాడు శిష్యుడు. ఆ మహావృక్షం తన కోరికని పక్కనున్న మరో వృక్షంతో చెప్తుంటే నాకు వినబడి తథాస్తు అన్నాను. "ఏమిటా కోరిక గురువు గారూ" తాను చక్రవర్తి అయి భూమండలాన్ని ఏలాలని. వచ్చే జన్మలోనా కాదు ఈ జన్మలోనే శిష్యుడు పగలబడి నవ్వాడు,
గురువు గారూ ఇది మరీ గొంతెమ్మ కోరిక కదూ.. అంత అత్యాశ తగునా? అర్హత చూసుకోవాల్సిన పనిలేదా ? అర్హతకేం నాయనా.. జీవితమంతా ప్రతి ఫలాపేక్ష లేకుండా ఫలాలనిచ్చింది. ఎన్నో జీవరాశులకి ఆశ్రయం ఇచ్చింది. అదంతా పుణ్యమే కదా అవుననుకోండి. కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది. ఏమో.. భగవానుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు. ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహా వృక్షం నేలకూలింది. శిష్యుడు నవ్వుకున్నాడు. అంతటితో ఆ విషయం మరిచి పోయాడు.

సంవత్సరం తరువాత...
శిష్యుడు పరుగు పరుగున వస్తూ గురువు గారూ.. ఈ వింత విన్నారా.. శ్రీరామచంద్రుల వారి పాదుకలకి పట్టాభిషేకం చేశారు వారి సోదరులు భరతుల వారు. ఇక నుండి పదునాలుగేళ్ళు పాదుకలు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట!
గురువు గారు నవ్వి, చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నావు. అయింది కదా..
"అంటే.."
అవున్నాయనా... ఆ మహా వృక్షం కలపతోనే వడ్రంగులు పాదుకలు చేశారు. అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు.. ఎన్ని జన్మలు ఎంత తపస్సు చేసిందో...ఎన్ని పుణ్యాలు చేసుకుందో ఆ మహావృక్షం పాదరక్షలుగా మారి శ్రీరామచంద్రుల వారి పాదాల వద్దకు చేరింది.
శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకల్ని భరతుల వారికివ్వడం, భరతుల వారు పాదుకలకి పట్టాభిషేకం చేయడం జరిగాయి. ఆ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహావృక్షం కోరిక నెరవేరింది, అని చెప్పిన గురువు గారికి సాష్టాంగ ప్రణామం చేశాడు శిష్యుడు.
భగవంతుడి లీలలు మనకి ఎప్పుడు అర్ధం కావు అందుకే అంటారు సంకల్పం ( కోరిక ) బలంగా ఉండాలి, అప్పుడు అందరి సహకారం ఉంటుంది అని.. శ్రీ గురుభ్యోనమ:












Click it and Unblock the Notifications