టెకీలకు గ్రేస్ పీరియడ్ పొడగింపు
వాషింగ్టన్: ఆర్ధిక వ్యవస్థలోని మాంద్యం కారణంగా ఉద్యోగాలు కోల్పొయిన ఐటి వర్కర్లు ప్రత్యామ్నాయ ఉద్యోగం వెతుక్కునేందుకు వీలుగా గ్రేస్ పీరియడ్‌ను పొడిగించాలని అమెరికా నిర్ణయించింది.
ప్రస్తుతం వున్న నిబంధనల ప్రకారం హెచ్1బి వీసాలపై అమెరికాలో ఉద్యోగానికి వచ్చిన టెకీలు చేస్తున్న ఉద్యోగం పోయిన వెంటనే ప్రత్యామ్నాయ ఉద్యోగం వెతుక్కోవల్సివుంటుంది. లేని పక్షంలో అలాంటివారిని వారి స్వదేశానికి తిప్పిపంపుతారు.
అయితే మాంద్యం కారణంగా కొత్త ఉద్యోగాలు దొరకడం కష్టసాధ్యంగా మారడంతో ప్రత్యామ్నాయాన్ని వెతుక్కునేందుకు కొంత వ్యవధిని ఇవ్వాలన్న డిమాండ్ వచ్చింది. ఇమ్మిగ్రేషన్ ఆక్టివిస్టులు, కార్పొరేట్ సంస్థలు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించాయి. చేస్తున్న ఉద్యోగం పోయిన తర్వాత కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి కనీసం ఆరునెలల గ్రేస్ పీరియడ్ కావాలని ఇమ్మిగ్రేషన్ ఆక్టివిస్టులు కోరుతున్నారు.
అయితే గ్రేస్ పీరియడ్ ఎంతవుండాలన్నది తాము ఇంకా నిర్ణయించలేదని ఐఎన్‌ఎస్ వర్గాలు చెప్పాయి. గ్రేస్ పీరియడ్‌ను పెంచడానికి చట్టాలను సవరించాల్సివుంటుందని ఆ వర్గాలు వివరించాయి. అయితే జులైకల్లా ఈ విషయంలో తాత్కాలిక మార్గదర్శక సూత్రాలను ఖరారు చేస్తామని ఆ తర్వాత మరో నెలరోజుల్లో అవసరమైన చట్టం చేస్తామని వారు వివరించారు. మాంద్యం వల్ల హెచ్1బి వీసాలపై అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వేలాది మంది టెకీలు ఉద్యోగాలు కొల్పోయారు. వీరిలో ఇండియన్స్ సంఖ్య అధికంగా వుంది. గ్రేస్ పీరియడ్ వల్ల ఉద్యోగం పోయిన టెకీలు టెన్షన్‌కు గురికాకుండా తాపీగా మరో ఉద్యోగం వెతుక్కునే వెసులుబాటు లభిస్తుంది.












Click it and Unblock the Notifications