కేంద్రమంత్రి రాజీనామా- హడావిడిగా ఉపఎన్నిక-ఈసీ తీరుపై చర్చ..!
కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తాజాగా కేబినెట్ నుంచి తప్పుకున్నారు. బీజేపీని తమిళనాడులో బలోపేతం చేసేందుకే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. అనూహ్యంగా రాజ్యసభ ఎంపీ పదవికీ గుడ్ బై చెప్పారు. దీంతో మరో నాలుగేళ్లు ఉన్న రాజ్యసభ ఎంపీ పదవిని వదులుకోవడం వెనుక ఏముందన్న చర్చ జరుగుతోంది. దీనికి బాలీవుడ్ నటిని ఆయన వేధించారని, దీంతో బీజేపీ అధిష్టానం ఆయనతో రాజీనామా చేయించిందన్న వార్తలు వచ్చాయి. ఈ పరిణామం జరిగిన వారం రోజుల్లోనే ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది.
మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికై ఎంపీగా, కేంద్రమంత్రిగా కొనసాగుతున్న ఎల్ మురుగన్ రాజీనామా చేయడంతో .. ఆ స్ధానం ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేయడమే కాకుండా, హడావిడిగా అక్కడ ఉపఎన్నిక (Rajya Sabha Bypoll) నిర్వహించేందుకు ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఎల్.మురుగన్ రాజీనామాతో మధ్యప్రదేశ్ రాజ్యసభ స్థానానికి నవంబర్ 12న ఉప ఎన్నిక నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. తాజా షెడ్యూల్ ప్రకారం నవంబర్ 12న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. నవంబర్ 12న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని, అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తామని తెలిపింది. ఈ వ్యవహారం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది. ఎంపీ పదవి ఖాళీ అయిన వారం రోజుల్లోనే ఇలా ఎన్నికల సంఘం హడావిడిగా ఉపఎన్నిక నిర్వహించేందుకు సిద్దం కావడం వెనుక ఏముందన్న చర్చ మొదలైంది.

ఎన్నికల సంఘం ఉప ఎన్నికను ఇంత హడావిడిగా ప్రకటించడమేంటన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. మురుగన్ రాజీనామా చేసి పది రోజులు కూడా కాకపోవడంతో ఈసీ ఎందుకింత హడావిడి ప్రదర్శిస్తోందన్న ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే దీని వెనుక కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్లో ఇప్పటికే నలుగురు వివిధ కారణాలతో మంత్రులు తప్పుకున్నారు. వీరి స్ధానాలు భర్తీ చేయడంతో పాటు మరో 10 మందిని కేబినెట్లోకి తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఆలస్యం కావడంతో ఉన్న మంత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ప్రధాని మోడీ ఈసారి కేబినెట్ ప్రక్షాళనకు సిద్దమవుతున్నారని, అందులో భాగంగానే ఇలా రాజ్యసభ సీటును భర్తీ చేయిస్తున్నారని సమాచారం. అదే జరిగితే త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ ఉండొచ్చని భావిస్తున్నారు. లేకపోతే ఈసీ ఇంత హడావిడిగా రాజ్యసభ ఉపఎన్నిక నిర్వహించాల్సిన అవసరం లేదని విశ్లేషకులు చెప్తున్నారు.














Click it and Unblock the Notifications
