అసెంబ్లీని పేల్చేసిన ఏఐ వీడియో.. కట్ చేస్తే కటకటాల పాలైన యువకుడు!
సోషల్ మీడియాలో ఏఐ సాంకేతికతను రకరకాలుగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ఏఐ వీడియోలు చేసి పోస్ట్ చేసి వాటిని వైరల్ చేస్తున్న వారు కూడా లేకపోలేదు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఏఐ దుర్వినియోగం చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఒక ఘటన స్పష్టం చేసింది. బీహార్‌కు చెందిన ఓ యువకుడు కర్ణాటక అసెంబ్లీ భవనం పేలిపోయినట్టు ఏఐ వీడియో తయారు చేసి పోస్ట్ చేయడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన డీప్‌ఫేక్ వీడియోలు ఎంత ప్రమాదకరమో మరోసారి గుర్తు చేస్తోంది. బీహార్‌లోని అరారియా జిల్లాకు చెందిన 25 ఏళ్ల హజ్రత్ అలీ షోయబ్ గత కొన్ని నెలలుగా బెంగళూరులో రోజువారీ కూలీగా, పైప్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అతను ఇన్‌స్టాగ్రామ్‌లో jnx_king_h_g అనే అకౌంట్‌లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో విధాన సౌధా భవనం బయటి దృశ్యాలు కనిపించిన తర్వాత ఏఐ సాయంతో సృష్టించిన పేలుడు దృశ్యాలు కనిపిస్తాయి.

క్యాప్షన్‌లో "విధానసభను బాంబుతో పేల్చేశాం" అని రాశారు. వీడియోలో అతను గన్ సంజ్ఞ చేస్తున్నట్టు కూడా కనిపించాడు.ఈ వీడియో వైరల్ కావడంతో విధాన సౌధా పోలీస్ స్టేషన్ సోషల్ మీడియా మానిటరింగ్ టీమ్ దృష్టికి వచ్చింది. పోలీసులు ఐపీ లాగ్స్, డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ ద్వారా అకౌంట్ వివరాలు సేకరించి యువకుడిని గుర్తించారు. మంగళవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి బుధవారం అతన్ని అరెస్ట్ చేశారు.
భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 353 కింద కేసు నమోదైంది. ఈ సెక్షన్ ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రకటనలకు సంబంధించినది. పోలీసులు యువకుడిని వీడియో ఎందుకు తయారు చేశాడు, ఎవరైనా సహాయం చేశారా అనే విషయాలు తెలుసుకుంటున్నారు. అసలు విధాన సౌధాలో ఎలాంటి పేలుడు జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఇలాంటి ఫేక్ వీడియోలు ప్రజల్లో అనవసర భయాన్ని కలిగించి, భద్రతా వ్యవస్థపై ఒత్తిడి పెంచుతాయని వారంటున్నారు.
ప్రస్తుతం ఏఐ సాంకేతికత చాలా సులభంగా అందుబాటులో ఉంది. దీనితో నిజమైన దృశ్యాలను మార్చి ఫేక్ వీడియోలు తయారు చేయడం సాధ్యమవుతోంది. సోషల్ మీడియాలో ఇలాంటి కంటెంట్ వేగంగా వ్యాపిస్తుంది. కాబట్టి ఏదైనా వీడియో చూసినప్పుడు ధృవీకరించుకోవాలి. అధికారిక సమాచారం లేకుండా షేర్ చేయకూడదు. పోలీసులు, ప్రభుత్వాలు డీప్‌ఫేక్ వీడియోలపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ కేసు అందరికీ హెచ్చరికగా నిలుస్తుంది.













Click it and Unblock the Notifications
