సౌదీ అరేబియాలోని ఎయిర్ పోర్ట్ పై మరో దాడి.. మృతుల్లో భారతీయుడు
గతకొద్ది రోజులుగా సౌదీలోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం అర్ధరాత్రి సౌదీలోని దమ్మమ్ ఎయిర్ పోర్ట్ పై హౌతీలు దాడి చేయగా ఇద్దరు మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని సౌదీలోని సివిల్ ఏవియేషన్ అథారిటీ వెల్లడించింది. యెమెన్ లోని హౌతీ దళాలు సౌదీపై దాడులను ఉద్ధృతం చేసిన నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు పేర్కొంది. ఇక మృతుల్లో ఒకరు భారతీయుడు కాగా మరొకరు సౌదీకి చెందిన వ్యక్తిగా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. అలాగే ఎయిర్ పోర్ట్ కు జరిగిన నష్టాన్ని ప్రస్తుతం అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.
ఇక గత కొన్ని వారాలుగా సౌదీలోని అంతర్జాతీయ విమానాశ్రయాలతోపాటు పలు ఇతర కీలక ప్రాంతాలపై హౌతీ దళాలు దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. అలాగే సౌదీలోని చమురు, మౌలిక సదుపాయాలపైనా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దాంతో రియాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేయగా అక్కడే జరగాల్సిన ఓ మేజర్ ఇన్వెస్ట్ మెంట్ కాన్ఫరెన్స్ కూడా వాయిదా పడింది. ఇక గత నెల రోజులుగా సౌదీలోని ఎయిర్ పోర్ట్స్ పై జరుగుతున్న దాడుల కారణంగా మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు సౌదీ అరేబియా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్న చమురు నౌకలపై ఎర్ర సముద్రంలో హౌతీలు బ్లాకేడ్ విధించాయి. సౌదీ నౌకలపై దాడులు చేపట్టాయి.

అటు హౌతీల దాడులకు ప్రతీకారంగా యెమెన్ లోని ఆయా స్థావరాలపై సౌదీ అరేబియా దాడులకు పాల్పడుతోంది. మరోవైపు ఈ దాడులపై సౌదీ స్టేట్ డిపార్ట్ మెంట్ అధికార ప్రతినిధి టామీ పైగోట్ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ఇరాన్ సపోర్ట్ తో హౌతీలు.. సౌదీ అరేబియాపై దాడులను తీవ్రతరం చేస్తున్నాయి. పౌర విమానాశ్రయాలతోపాటు మౌలిక సదుపాయాలపై దాడులు పెరుగుతున్నాయి.. అని అన్నారు. అటు సౌదీ అరేబియాకు సపోర్ట్ గా హౌతీలపై దాడులు చేసేందుకు అమెరికా ఆసక్తి చూపించడం లేదు. అయితే తాము రియాద్ కు ఎఫ్-35 ఫైటర్ జెట్స్ ను అధికంగా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
