మహిళా రిజర్వేషన్లకు త్వరలో మోక్షం
న్యూఢిల్లీః రాజకీయ పరమైన అభిప్రాయభేదాలను పక్కనబెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో అన్ని పార్టీలు ఒక అవగాహనకు రావల్సిన అవసరం వున్నదని ప్రధాని వాజ్‌పేయి కోరారు. ఈ బిల్లులోని వివాదాస్పద అంశాలను పక్కనబెడితే బిల్లుకు అందరి ఆమోదం సాధించడం అసాధ్యమేమీ కాదని ఆయన అన్నారు.
శుక్రవారం నాడు ఢిల్లీలో జరిగిన మహిళా హక్కుల జాతీయ వేదిక సదస్సులో ప్రధాని ప్రసంగించారు. కొందరు పురుషులు మహిళలకు ఏం కావాలో వారికంటే తమకే ఎక్కువ తెలుసుననుకునే భావనలో వున్నారని ఆయన చురకవేశారు. ఈ బిల్లు కార్యాచరణ దాల్చకపోవడానికి ఇలాంటి వైఖరే కారణమని ఆయన అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లువిషయంలో ప్రభుత్వం కృత నిశ్చయంతో వున్నదని, ఆడపడుచులకు ఇచ్చిన హామీనినెరవేర్చితీరుతామని ఆయన చెప్పారు.
మహిళలు తమకేం కావాలో వారికే బాగా తెలుసునని ప్రధాని అన్నారు. వారికికావల్సింది వారినే తీసుకునే వెసులుబాటు కల్పిస్తే 33 శాతం కంటే తక్కువే రిజర్వేషన్ తీసుకుంటారని సభికుల నవ్వుల మధ్య వాజ్‌పేయి వ్యాఖ్యానించారు. ఈ బిల్లు విప్లవాత్మకమైనదని మహిళల సాధికారికతకు ఎంతగానో దొహదం చేస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications
