వైరస్ విధ్వంసం ఖరీదు 1000 కోట్ల డాలర్లు
సాన్‌ఫ్రాన్సిస్కోః ఈ ఏడాది జులై, ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ ప్రపంచంలో గగ్గోలు సృష్టించిన కోడ్ రెడ్ వైరస్ సృష్టించిన విధ్వంసం ఖరీదు 260 కోట్ల డాలర్లు వుంటుందని నిపుణులు అంచనావేశారు. ఈ రెడ్ కోడ్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కంప్యూటర్లను ధ్వంసం చేయడంతో పాటు నెట్‌వర్క్‌లను విచ్ఛిన్నం చేసిన విషయం విదితమే.
రెడ్‌కోడ్ సృష్టించిన బీభత్సాన్ని కూడా కలుపుకుంటే ఈ ఏడాది కంప్యూటర్ వైరస్‌లు సృష్టించిన ఉత్పాతం ఖరీదు 1070 కోట్ల డాలర్లు వుంటుందని నిపుణులు అంటున్నారు. తొలి ఎనిమిదినెలల్లోనే ఇంత భయంకరంగా వుందంటే ఏడాది చివరనాటికి పరిస్థితి మరింత దారుణంగా వుండే అవకాశం వున్నదని కాలీఫోర్నియ సంస్థ కంప్యూటర్ ఎకనామిక్స్ పేర్కొంది.
1999లో కంప్యూటర్లపై వైరస్ దాడి నష్టం 1210 కోట్ల డాలర్లు వుండగా 2000 సంవత్సరంలో 1700 కోట్ల డాలర్లు వుంది. గత ఏడాది కంప్యూటర్లపై దాడి చేసిన లవ్‌బగ్ వైరస్ ఇప్పటివరకు వచ్చిన వైరస్‌లన్నింటిలోకి అత్యంత నష్టం కలిగించింది. ఈ వైరస్ సుమారు 50 వేరువేరు రూపాల్లో జరిపిన దాడిలో 870 కోట్ల డాలర్లమేర నష్టం జరిగింది. లక్షలాది కంప్యూటర్లు దెబ్బతిన్నాయి. అత్యంత విలువైన డేటా అంతా మట్టికొట్టుకుపోయింది. ఈ ఏడాది కోడ్ రెడ్ సృష్టించిన బీభత్సం నుంచి తేరుకోక ముందే సిర్కోమ్ దాడి చేసింది.












Click it and Unblock the Notifications
