తుపాను ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..!
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అక్వాన్ తుపాను కారణంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నవంబర్ 20 నుంచి 22 మధ్య కాలంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా తూర్పు అలాగే దక్షిణ జిల్లాలలో వాతావరణం మారుతుందని.. తద్వారా వర్షాల తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఈ నెల 21, 22 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు భారీ వర్షాల నేపథ్యంలో సంబంధిత జిల్లాల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో చలి తీవ్రత అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తుపాను రాకతో రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మరోవైపు రాష్ట్రంలో వరికోతలు, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వాతావరణ మార్పుల దృష్ట్యా ముందస్తుగా నివారణ, రక్షణ చర్యలను పాటించడం కారణంగా వీలైనంతగా పంట నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందని నిపుణులు సూచనలు చేస్తున్నారు.

మరోవైపు అక్వాన్ తుపాను ప్రభావం ఏపీలోని కోస్తా తీరంపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనావేసింది. రానున్న 24 గంటల్లో ఇది తుపానుగా బలపడి.. మంగళవారం నాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఈ తుపాను ప్రభావంతో ఈ నెల 20వ తేదీన ఉత్తర కోస్తా తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే తుపాను బలపడే క్రమంలో సముద్రంలో ఆటుపోట్లు అధికంగా ఉంటాయని.. సాయంత్రంలోపు మత్స్య కారులు తీరానికి చేరుకోవాలి హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications
