సర్పంచ్ పదవి రూ.81 లక్షలు.. పల్నాడులోని ఆ ఊరికి మామూలు డిమాండ్ కాదు!
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల వాతావరణం మొదలైంది. సాధారణంగా ఎన్నికలంటే ప్రచార హోరు, నామినేషన్ల హడావిడి, వర్గ విభేదాలు, కోట్ల రూపాయల ఖర్చు అనే చిత్రం మన ముందుంటుంది. కానీ ఈసారి కొన్ని గ్రామాల్లో పూర్తిగా భిన్న వాతావరణం కనిపిస్తోంది. తొలి విడత ఎన్నికలకు నామినేషన్లు కూడా ప్రారంభం కాకముందే ఏకగ్రీవాల వైపు గ్రామాలు మళ్లుతున్నాయి.
ఎన్నికల ఖర్చు, అనవసర వివాదాలు తప్పించి గ్రామాభివృద్ధిపై దృష్టి పెట్టాలని స్థానికులు భావిస్తున్నారు.ఇందులోనూ పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డ పంచాయతీలో జరిగిన సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. ఐదు వేల లోపు జనాభా ఉన్న ఈ గ్రామంలో సర్పంచ్ పదవి కోసం బహిరంగ వేలంపాట జరిగింది. రెండు ప్రధాన పార్టీల నేతలు ఏకగ్రీవంగా ఎన్నికలు జరగకుండా చేయాలని నిర్ణయించుకున్నారు.

అయితే సర్పంచ్ పదవికి ముగ్గురు అభ్యర్థులు పోటీకి సిద్ధమవడంతో గ్రామ పెద్దలు సమాలోచన చేశారు. చివరికి వేలంపాట ద్వారా అభ్యర్థిని ఎంపిక చేయాలని నిర్ణయించారు.రెండు రోజుల క్రితం గ్రామ పెద్దల సమక్షంలో జరిగిన వేలంలో తీవ్ర పోటీ నెలకొంది. కొరటా గోపాలరావు రూ.77 లక్షలు చెల్లించేందుకు ముందుకు రాగా, యర్రా శ్రీనివాసరావు రూ.81 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో ఆయన్నే ఏకగ్రీవ అభ్యర్థిగా ఖరారు చేశారు.
వేలం ముగిసిన వెంటనే గ్రామంలో ఆయన పేరిట ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. ఈ మొత్తం గ్రామ అభివృద్ధికే వినియోగించబడుతుందని స్థానికులు చెబుతున్నారు.ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఐదు వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15 లక్షలు, ఐదు నుంచి పది వేల మధ్య ఉన్నవాటికి రూ.25 లక్షలు, పది వేలకు పైగా ఉన్నవాటికి రూ.50 లక్షలు అందుతాయి.
జొన్నలగడ్డ ఏకగ్రీవమైతే అభ్యర్థి చెల్లించిన రూ.81 లక్షలతో పాటు ప్రభుత్వం ఇచ్చే రూ.15 లక్షలు కూడా జమ అవుతాయి. మొత్తం దాదాపు రూ.96 లక్షల నిధి గ్రామ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యాలు, పాఠశాల మెరుగుదల వంటి పనులకు ఈ నిధులు ఉపయోగపడతాయని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వేలంపాటలు కొన్ని ఇతర గ్రామాల్లోనూ జరుగుతున్నాయని సమాచారం.
ఎన్నికల ఖర్చులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో గ్రామాలు ఏకగ్రీవాల వైపు మళ్లడం సహజమే. అయితే సర్పంచ్ పదవికి ఇంత భారీ మొత్తం చెల్లించడం వెనుక ఆర్థిక శక్తి, స్థానిక ప్రభావం కూడా ఉందని కొందరు గమనిస్తున్నారు. ఏది ఏమైనా, గ్రామాభివృద్ధికి నిధులు అందడం మాత్రం సానుకూల పరిణామం. తొలి విడత ఎన్నికలు సమీపంలో ఉండగా, ఇలాంటి ఏకగ్రీవాలు మరిన్ని గ్రామాల్లో కనిపిస్తాయా అనేది ఇప్పుడు అందరి దృష్టిలో ఉంది.













Click it and Unblock the Notifications
