కేంద్రం తక్షణ సాయం కోరిన చంద్రబాబు ..! భవిష్యత్తులో తుఫాన్లు ఎదుర్కోవాలంటే..?
ఏపీకి మురసు తుఫాన్ వల్ల కలిగిన నష్టం అంచనా వేసేందుకు కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ నేతృత్వంలో 7 మంది సభ్యుల కేంద్ర బృందం బాపట్ల, పల్నాడు, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో రెండు బృందాలుగా విడిపోయి పర్యటించింది. క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంట పొలాలు, కాలువలు, రహదారులు, ఇళ్లు పరిశీలించింది. బాపట్ల, జమ్మలపాలెం, చీరాల, చిన్నగంజాం, పర్చూరు, నిడమర్రు, ఉంగుటూరు, చిలకలూరి పేట, గౌరీపట్నం సహా దాదాపు 60 ప్రాంతాల్లో పర్యటన అనంతరం సీఎం చంద్రబాబుకు (Chandrababu) రిపోర్ట్ ఇచ్చింది. అలాగే ప్రభుత్వం తరఫున చంద్రబాబు కూడా వారికి రిపోర్ట్ ఇచ్చారు.
దీనిపై ఇవాళ కేంద్ర బృందంతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఎల్‌నినో ఓవైపు, ఒకేసారి రెండు తుఫాన్లు రావడం రాష్ట్రానికి భారీ నష్టం కలిగించిందని వారికి తెలిపారు. తుఫాన్ గమనాన్ని ముందే అంచనాన్ని వేసి ముందస్తు చర్యలు తీసుకున్నామని, అయినా కోస్తాంధ్ర ప్రాంతం తరచూ తుఫాన్లు ఎదుర్కొంటూనే ఉందని పేర్కొన్నారు. తుఫాన్ నష్టాన్ని తగ్గించేలా శాశ్వత పరిష్కారంగా మౌలిక వసతులు మరింత ధృఢంగా నిర్మించాలని, దీనికి కేంద్ర సాయం కావాలన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని 10 రోజుల్లో తుఫాన్ నష్టంపై కేంద్రానికి నివేదిక సమర్పించాలని కోరారు. తక్షణం తుఫాన్ సాయాన్ని అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

అలాగే మురసు వల్ల దాదాపు రూ.2484.43 కోట్ల నష్టం జరిగినట్టు కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వ అంచనాలతో నివేదిక ఇచ్చారు.
1,385 కి.మీ. రహదారులు, 36 చోట్ల గండ్లు, 65 కల్వర్టులు దెబ్బతినగా రూ.888.84 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. 1,43,617 హెక్టార్లలో రూ.874.97 కోట్ల పంట నష్టం వాటిల్లగా, 1,86,063 మంది రైతులు ప్రభావితమయ్యారన్నారు. 6,756 హెక్టార్ల ఉద్యానపంటలకు రూ.337.10 కోట్ల నష్టం జరగ్గా, 12,605 మంది రైతులు ప్రభావితమయ్యారని తెలిపారు. 369 సాగునీటి వనరులు, 509 చోట్ల గండ్లు పడ్డాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 220 కి.మీ. మేర 114 రహదారులు దెబ్బతిన్నాయన్నారు. అత్యవసర సహాయక చర్యల వ్యయం రూ.37.00 కోట్లు అయ్యిందన్నారు. కాబట్టి కేంద్రం సానుకూలంగా స్పందించి సాయం విడుదల చేయాలన్నారు.














Click it and Unblock the Notifications
