కాంగ్రెస్ కు ద్రోణంరాజు గుడ్ బై!
హైదరాబాద్: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ద్రోణంరాజు సత్యనారయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మంగళవారం విలేకరులకు ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. పార్టీలోని కొందరి వ్యక్తుల వల్ల, పరిస్థితుల వల్ల విసిగి తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన చెప్పారు. పార్టీకి నా అవసరం లేదనిపిస్తోంది. పార్టీ అధిష్టానం గత కొద్ది కాలంగా నన్ను పక్కకు తప్పించి అవమానపరిచింది. అందుకే రాజీనామా చేస్తున్నాని ఆయన కారణాన్ని వివరించారు. ఉత్తరాంధ్రకు చెందిన ద్రోణంరాజు సత్యనారయణ సీనియర్ రాజకీయవేత్త. నాలుగు దశాబ్దాలకుపైగా ఆయన కాంగ్రెస్ కు సేవలందించారు. గతంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యాక్షుడిగా కూడా పనిచేశారు.
అయితే, గత కొద్ది కాలంగా ఆయన సిఎల్పీ నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి వైఖరిపై అసంతృప్తిగా ఉన్నారు. పేరు ప్రస్తావించకుండా ఆయన ఈ విషయాన్ని అంగీకరించారు కూడా. ఏ వ్యక్తి వస్తే పార్టీ రాష్ట్రం బాగుపడుతుందనుకున్నానో...అతని తీరే బాధ కలిగించే విధంగా ఉంది. రాజీనామా విషయంలో వెనక్కి తగ్గేది లేదని, ఎవరు ఒత్తిడి తీసుకువచ్చినా తన నిర్ణయంలో మార్పు లేదని ఆయన తేల్చి చెప్పారు. వేరే పార్టీలో చేరుతారా అన్న ప్రశ్నకు, కాలమే నిర్ణయిస్తుందని సమాధానమిచ్చారు.












Click it and Unblock the Notifications
