వరంగల్ జిల్లాలో నలుగురు నక్సల్స్ హతం
వరంగల్: వరంగల్ జిల్లాలో గురువారం పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు జనశక్తి సభ్యులు మరణించారు. మావోయిస్టులను కలవడానికి జనశక్తి నక్సలైట్లు వెళ్తుండగా ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు వరంగల్ జిల్లా పోలీసు సూపరింటిండెంట్ (యస్పీ) స్టీఫెన్ రవీంద్ర మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఈ ఎన్‌కౌంటర్ వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం రామకృష్ణాపురం అటవీ ప్రాంతంలో జరిగింది.
సంఘటనా స్థలం నుంచి ఏడు తుపాకులు, 8 కిట్ బ్యాగ్‌లు స్వాధీనం చేసుకున్నట్లు స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. మృతుల్లో ప్రముఖులు లేరని భావిస్తున్నారు. వెంకటపురం, తదితర ప్రాంతాల్లో ప్రముఖులను హత్య చేయడానికి, పోలీసు స్టేషన్లపై దాడి చేయడానికి నక్సలైట్లు వ్యూహరచన చేసినట్లు తమకు సమాచారం అందిందని యస్పీ చెప్పారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఇద్దరిని పోలీసులు గుర్తించారు. మరణించినవారిలో హంసరెడ్డి అలియాస్ నాగన్న దళంలో పనిచేస్తున్న గోపి, లక్ష్మణ్ అనే ఇద్దరున్నట్లు పోలీసులు చెప్పారు. మరో నలుగురు నక్సలైట్లు తప్పించుకున్నట్లు యస్పీ చెబుతున్నారు. తప్పించుకున్నవారిలో దళ నాయకుడు హంసరెడ్డి అలియాస్ నాగన్న ఉన్నట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
