మేం చంద్రబాబు లాగా కాదు: వీరప్ప మొయిలీ
హైదరాబాద్: తమ పార్టీ నారా చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ వంటిది కాదని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ చార్జీ వీరప్ప మొయిలీ అన్నారు. చంద్రబాబు అవకాశవాది, సెక్టేరియన్ అని ఆయన బుధవారం గాంధీభవన్ లో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ ప్రస్తావన లేకుండానే ఆయన పిసిసి, డిసిసిల సమావేశాలను ముగించారు. తమ పార్టీలో అందరకీ చోటు ఉంటుందని, ఎవరి పట్లా వివక్ష ఉండదని ఆయన అన్నారు. రెండో ఎస్సార్సీ ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, ఈ విషయాన్ని యుపిఎ కనిసి ఉమ్మడి ప్రణాళిక (సియంపి)లో స్పష్టంగా చెప్పామని ఆయన అన్నారు.
చంద్రబాబు, ములాయం సింగ్ ఎంత మంది వచ్చినా మూడో ఫ్రంట్ వల్ల యుపిఎకు వాటిల్లే నష్టం ఏమీ లేదని, మూడో ఫ్రంట్ నాయకులు గాలిలో మేడలు కడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అణు ఒప్పందాన్ని వామపక్షాలు వ్యతిరేకించడం లేదని, బుష్ హయాంలో దాని అమలును వ్యతిరేకిస్తున్నాయని ఆయన అన్నారు. ఒకసారి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అమలు చేయకపోతే దేశ గౌరవం దెబ్బ తింటుందని ఆయన అన్నారు. పార్టీయే సుప్రీం అని, ముఖ్యమంత్రీ మంత్రులూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆయన చెప్పారు. మంత్రుల పనితీరును సమీక్షించి నివేదికలు తెప్పించుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
