ప్రభాకర్ హత్య కేసులో శైలజకు జీవితఖైదు
హైదరాబాద్: ఫైనాన్షియర్ ప్రభాకర్ హత్య కేసులో శైలజకు నాంపల్లి కోర్టు జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పింది. శైలజకు 25 వేల రూపాయల జరిమానా కూడా విధించింది. ప్రభాకర్ అనే ఫైనాన్షియర్ ను శైలజ 2003లో ముక్కలు ముక్కలుగా నరికి గోనెసంచిలో కుక్కి ఇంటి నుంచి పారిపోయింది. ఈ నేరం రుజువు కావడంతో శైలజకు కోర్టు శిక్ష ఖరారు చేసింది.
భర్తకు సంపాదన లేకపోవడంతో సంజీవరెడ్డి నగరులో ఉంటున్న శైలజపై ఇద్దరు పిల్లల భారం పడింది. ఈ స్థితిలో శైలజ ప్రభాకర్ రెడ్డితో వైవాహికేతర సంబంధం పెట్టుకుంది. అతని వద్ద 50 వేల రూపాయలు అప్పు కూడా తీసుకుంది.
అప్పు చెల్లించాలంటూ ఒత్తిడి పెరగడంతో ఒక రోజు ప్రభాకర్ కి బాగా మద్యం తాగించింది. ఆ తర్వాత హత్య చేసింది. శరీరాన్ని ముక్కలు ముక్కలు నరికి గొనె సంచిలో కుక్కి ఇంటికి తాళం వేసి పారిపోయింది. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇంటిలోకి ప్రవేశించి ప్రభాకర్ శరీరభాగాలను కనుక్కున్నారు. ఆ తర్వాత రెండు రోజులకు శైలజను పోలీసులు పట్టుకోగలిగారు. కుటుంబ భారం తనపై ఉన్నందున మానవీయ కోణంలో ఆలోచించి శిక్ష నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని శైలజ కోర్టుకు విజ్ఞప్తి చేసుకుంది. అయితే కోర్టు ఆమెకు జీవిత ఖైదు విధించింది.












Click it and Unblock the Notifications
