తెలంగాణకు వైయస్ అడ్డు కారు: మొయిలీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అడ్డు పడుతున్నారనే వ్యాఖ్యల్లో నిజం లేదని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. తెలంగాణకు ఎవరూ అడ్డు పడడం లేదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై నిర్ణయాన్ని అందరూ తమ పార్టీ నాయకురాలు సోనియా గాంధీకి వదిలేశారని, ఈ విషయం తెలంగాణ రాష్ట్ర సమితికి కూడా తెలుసునని ఆయన అన్నారు.
సోనియా నిర్ణయానికి రాజశేఖర రెడ్డి కట్టుబడి ఉంటారని ఆయన చెప్పారు. తెలంగాణపై మాజీ మంత్రి ఎం. సత్యనారాయణరావు వంటి సీనియర్ నేతలు విమర్శలు చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. తెలంగాణపై ఏకాభిప్రాయం కుదరాల్సిన అవసరం ఉందని, దాని కోసం ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణపై నిర్ణయం తీసుకునే అంశం కేవలం సోనియా వద్దనే లేదని, తమ మిత్రపక్షాల నిర్ణయం కూడా అవసరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications