షార్జాలోని ఆరుగురిని ఆదుకుంటాం: షబ్బీర్
హైదరాబాద్: షార్జాలో ఉరిశిక్ష పడి జైళ్లో మగ్గుతున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆరుగురు ఆంధ్రులను రక్షిస్తామని రాష్ట్ర విద్యుచ్ఛక్తి మంత్రి షబ్బీర్ అలీ హామీ ఇచ్చారు. చేయని నేరానికి నిజామాబాద్ జిల్లా అర్మూర్ మండలం దేగాం గ్రామానికి చెందిన ఈ ఆరుగురు వ్యక్తులకు ఉరిశిక్ష పడిందనే వార్తపై ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రతిస్పందించారు. ఈ విషయంపై తాను ప్రధాని మన్మోహన్ సింగ్ తో మాట్లాడుతానని ఆయన చెప్పారు. తాను షార్జాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించానని, ఆ కార్యాలయం అధికారులు ఉరిశిక్ష పడిన విషయాన్ని ధృవీరకించడం లేదని ఆయన అన్నారు.
అవసరమైతే తాను దుబాయ్ వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. షార్జాలో ఉరిశిక్ష ఉన్నా గత 27 ఏళ్లలో ఎవరికీ ఆ శిక్ష పడలేదని ఆయన చెప్పారు. ఈ ఆరుగురి విషయంలో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును ఎగువ కోర్టులో సవాల్ చేస్తామని ఆయన అన్నారు. దేగాం గ్రామానికి చెందిన బోదస్తు మల్లయ్య, దండుగుల వొడ్డె ముత్యం, ఇడగొట్టి పెద్ద గంగారాం, అల్లెపు రాజారాం, గంగాధర్, ఇడుగట్టి చిన్న గంగారాం విడివిడిగా విజిట్ వీసాలపై దబాయ్ వెళ్లారు. ఒక పాకిస్తాన్ వ్యక్తిని దోచుకుని హత్య చేశారనే ఆరోపణ మోపి వారిని జైలు పాలు చేశారని, చివరికి వారికి ఉరిశిక్ష పడిందని వార్తలు పచ్చాయి.












Click it and Unblock the Notifications
