ఇది సినిమా హాలు కాదు: హైకోర్టు
హైదరాబాద్: కోర్టు సినిమా హాలు కాదని హైకోర్టు బుధవారం జూనియర్ డాక్టర్లను చీవాట్లు పెట్టింది. కోర్టు హాలులో జూనియర్ డాక్టర్లు చప్పట్లు కొట్టడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము చనిపోయిన తర్వాత భద్రత కల్పిస్తారా అని జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు వేసిన ప్రశ్నకు జూనియర్ డాక్టర్లు చప్పట్లు కొట్టారు. దీంతో ఆగ్రహించిన ప్రధాన న్యాయమూర్తి - ఇది పవిత్రమైన కోర్టు, సినిమా హాలు కాదు అని అంటూ తలుపులు వేసేసి వారిని అరెస్టు చేయండని ఆదేశించారు. జూనియర్ డాక్టర్లపై కోర్టు ధిక్కార కేసు నమోదు చేయాలని కూడా ఆదేశించారు. జూనియర్ డాక్టర్లు వెనక్కి తగ్గి క్షమాపణ చెప్పడంతో ప్రధాన న్యాయమూర్తి వెనక్కి తగ్గారు.
జూనియర్ డాక్టర్ల భద్రతను తాము చూసుకుంటామని హైకోర్టు హమీ ఇచ్చింది. దీంతో జూనియర్ డాక్టర్లు బేషరతుగా సమ్మెను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనను కోర్టు రికార్డు చేసింది. రేపటి లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు జూనియర్ డాక్టర్లను ఆదేశించింది. జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై రేపు హైకోర్టు విచారణ జరుపుతుంది. సమ్మె విరమిస్తేనే జూనియర్ డాక్టర్ల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని హైకోర్టు తెలియజేసింది.












Click it and Unblock the Notifications