వైద్యుల సమ్మె: వైద్య సేవలకు ఆటంకం
హైదరాబాద్: వైద్యులు, జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగడంతో సోమవారం ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రభుత్వాస్పత్రుల్లో రక్షణకు ఆర్డినెన్సును జారీ చేయాలని, జూనియర్ డాక్టర్లపై దాడికి దిగిన మజ్లీస్ శాసనసభ్యులు అఫ్సర్ ఖాన్, పాషా ఖాద్రీలను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ వారు సమ్మెకు దిగారు. భారత వైద్య మండలి (ఐఎంఎ), ప్రైవేట్ వైద్యులు మాత్రం సమ్మెకు దూరంగా ఉన్నారు.
విజయవాడలో 300 మంది వైద్యులు సమ్మెకు దిగారు. విశాఖపట్నంలోని కెజిహెచ్ వైద్యులు దాదాపు 700 మంది విధులను బహిష్కరించారు. వరంగల్లులోని ఎంజిహెచ్ ఆస్పత్రిలో ఇద్దరు వైద్యులు మాత్రమే విధులకు హాజరయ్యారు. వైద్యం అందక కర్నూలులో ఒక రోగి మృతి చెందారు. వైద్యుల విధుల బహిష్కరణతో ఔట్ పేషెంట్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉస్మానియా డెంటల్ అస్పత్రి వైద్యులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. ప్రభుత్వాస్పత్రుల్లో రక్షణ కల్పించే ఆర్డినెన్స్ గెజిట్ లో ప్రచురితమైన తర్వాతనే సమ్మె విరమిస్తామని జూనియర్ డాక్టర్లు చెప్పారు.












Click it and Unblock the Notifications
