కర్నూలు అస్పత్రిలో 4గురు మృతి
కర్నూలు: వైద్యుల సమ్మె కారణంగా వైద్య సేవలు అందకపోవడంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారంనాడు నలుగురు మరణించారు. మృతుల్లో ఒక చిన్నారితో పాటు ముగ్గురు మహిళలున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన సమ్మెలో భాగంగా సోమవారం కర్నూలు ప్రభుత్వాస్పత్రి వైద్యులు సమ్మెకు దిగారు. అత్యవసర సేవలు మినహా ఏవీ అందుబాటులో లేవు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
జూనియర్ డాక్టర్లపై దాడి చేసిన మజ్లీస్ శాసనసభ్యులను అరెస్టు చేయాలని, ప్రభుత్వాస్పత్రుల్లో రక్షణకు ఆర్డినెన్స్ తేవాలని డిమాండ్ చేస్తూ కర్నూలు ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు, సీనియర్ డాక్టర్లు, నర్సులు సోమవారంనాడు రాస్తారోకో నిర్వహించారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మెను విరమించేది లేదని జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. సమ్మె విషయం సరిగా తెలియకపోవడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి రోగులు వస్తూనే ఉన్నారు. ఇక్కడికి వచ్చాక సేవలు లభించక తల్లడిల్లుతున్నారు.












Click it and Unblock the Notifications
