హైదరాబాద్:ఖైరతాబాద్ ఎమ్మెల్యే పి జనార్దన్ రెడ్డి భౌతిక కాయాన్ని శనివారం గాంధీ భవన్ కు తరలించారు. ప్రజల సందర్శనార్థం అక్కడ రెండుగంటల పాటు ఉంచుతారు. అనంతరం కోఠి, ఛాదర్ ఘాట్ ల మీదుగా అంబర్ పేట్ స్మశాన వాటికకు తరలించి అక్కడ అంత్య క్రియలు జరుపుతారు. శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో దోమల్ గూడా ఇంటినుంచి గాంధీ భవన్ కు జనార్దన్ రెడ్డి భౌతిక కాయాన్ని తరలించారు. భౌతిక కాయాన్ని తరలిస్తున్న వాహనంలో హైదరాబాద్ మరో బ్రదర్ మర్రి శశిధర్ రెడ్డి, వి హనుమంతరావు తదితరులు ఉన్నారు. దారులన్నీ వేలాదిగా తరలివచ్చిన ఆయన అభిమానులతో నిండిపోయాయి. జెన్నన్న అమర్ రహే నినాదాలతో వీధులు దద్ధరిల్లాయి. పి.జనార్దన్ రెడ్డి అంత్య క్రియల ఏర్పాట్లను ఎనిమిది మంది మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని మంత్రి షబ్బీర్ అలీ తెలిపారు.