విజయ్ కు ఈసీ బిగ్ న్యూస్- టీవీకే పార్టీ, గుర్తుపై కీలక నిర్ణయం..!
ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఘన విజయం సాధించడమే కాకుండా, ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసిన టీవీకే అధినేత విజయ్ కు (Vijay) కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగానికి 2024లో నమోదైన రాజకీయ పార్టీగా రిజిస్ట్రేషన్ ఇచ్చిన ఈసీ.. ఇవాళ రాష్ట్ర పార్టీగా గుర్తింపు నిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే టీవీకే గుర్తు విజిల్ ను ఆ పార్టీకి శాశ్వత చిహ్నంగా కూడా కేటాయించింది. దీంతో టీవీకే శ్రేణులు సంతోషంలో మునిగిపోయాయి. ఈసీ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం విజయ్ సుదీర్ఘ ట్వీట్ పెట్టారు.
నా హృదయంలో నిలిచిన తమిళనాడు ప్రజలందరికీ విజయ్ హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు. మూడు దశాబ్దాలకు పైగా, మీరు నాపై అపారమైన ప్రేమను కురిపించారు, నా జీవితంలో ఒక అరుదైన, ఉన్నతమైన స్థానాన్ని కల్పించడమే కాకుండా, ప్రతి ఇంట్లోనూ, ప్రతి హృదయంలోనూ-ఒక కుటుంబ సభ్యుడిగా, బంధువుగా, కొడుకుగా, సోదరుడిగా, తమ్ముడిగా-నాకు శాశ్వత స్థానాన్ని ఇచ్చి, అమ్మలాంటి ఆప్యాయతతో నన్ను ఆదరించారని విజయ్ ఈ సందర్భంగా తెలిపారు. తమకు సర్వస్వం ప్రసాదించిన తమిళనాడు ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సమాజానికి కృతజ్ఞతలు ఎలా తీర్చుకోవాలనే దానిపై ఆలోచించి, దానికి ప్రతీకగా 2024లో 'తమిళనాడు విక్టరీ పార్టీ' (TVK)ని ప్రారంభించామన్నారు.

లౌకిక సామాజిక న్యాయం అనే విధానంతో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి కేవలం 27 నెలలే అయ్యిందని, అయినప్పటికీ, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో నిరూపితమైనట్లుగా, తమిళనాడు రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ లేని అద్భుతాన్ని తాము సాధించామన్నారు. 35% ఓట్లతో, మీరు టీవీకేని అతిపెద్ద పార్టీగా నిలబెట్టారన్నారు. మీ తీర్పును గౌరవిస్తూ, ప్రజాస్వామ్య శక్తుల మద్దతుతో, మీ సేవకుడిగా మరియు తమిళనాడు ప్రజల ముఖ్యమంత్రిగా, అవినీతి రహిత, నిజాయితీతో కూడిన పరిపాలనను అందించాలనే ఆశయానికి కట్టుబడి తాను ఇక్కడ నిలబడి ఉన్నానని విజయ్ తెలిపారు. లౌకిక సామాజిక న్యాయం కోసం విజయవంతమైన కూటమిని ఏర్పాటు చేసి, 'తమిళనాడు విక్టరీ పార్టీ' నాయకత్వంలో ఒక చారిత్రాత్మక, ఆదర్శవంతమైన ప్రభుత్వాన్ని స్థాపించామన్నారు.

ప్రజలారా, నా సొంత బంధువులారా, తమిళనాడు రాజకీయ చరిత్రలో మీరు ఒక అద్భుతాన్ని సృష్టించారు, దీనికి గుర్తింపుగా, భారత ఎన్నికల సంఘం మీ 'తమిళనాడు విక్టరీ పార్టీ'ని తమిళనాడు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో నమోదిత రాజకీయ పార్టీగా గుర్తించిందన్నారు. ప్రజాస్వామ్య విప్లవానికి నిశ్శబ్ద సంకేతమైన మీ 'విజిల్' గుర్తును టీవీకే యొక్క అధికారిక గుర్తుగా కూడా గుర్తించిందన్న వార్తను తాము ఎంతో గర్వంతో పంచుకుంటున్నామన్నారు. లౌకిక సామాజిక న్యాయ విధానంతో, మాపై నమ్మకం ఉంచిన ప్రజలందరికీ కృతజ్ఞతతో సేవ చేసే మా ప్రయాణం ఎప్పటికీ కొనసాగుతుందన్నారు. ఈ సమయంలో, పార్టీని కాపాడటానికి అవిశ్రాంతంగా శ్రమిస్తున్న కార్యకర్తలు, నిర్వాహకులను గర్వంతో స్మరించుకుంటున్నానంటూ విజయ్ ధన్యవాదాలు తెలిపారు.














Click it and Unblock the Notifications
