అశేష జనావళి మధ్య పీజేఆర్ అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్:శుక్రవారం హఠాన్మరణం చెందిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే పబ్బతిరెడ్డి జనార్దన్ రెడ్డి(పీజేఆర్)అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంబర్ పేట్ స్మశానవాటికలో శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అధికారిక లాంఛనాల మధ్య, పీజేఆర్ అమర్ రహే అనే నినాదాలు హోరెత్తగా కుమారుడు విష్ణువర్థన్ రెడ్డి చితికి నిప్పంటించడంతో అంత్యక్రియలు పూర్తయ్యాయి.
అంతకుముందు గాంధీ భవన్ నుంచి పీజేర్ అంతిమ యాత్ర ప్రారంభమై మోజం జాహి మార్కెట్, కోఠి, ఛాదర్ ఘాట్ మీదుగా రెండుగంటలకు పైగా సాగింది. ఇసకేస్తే రాలనంతగా అభిమానులు ఈ యాత్రలో పాల్గొన్నారు. అంబర్ పేట స్మశాన వాటికలో ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి, పీసీసీ మాజీ అద్యక్షుడు కేశవరావు, తాత్కాలిక అధ్యక్షుడు జీఎస్ రావు, టీడీపీ సీనియర్ నేత టి దేవేందర్ గౌడ్, నన్నపనేని రాజకుమారి, భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖా అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, తెలంగాణా రాష్ట్ర సమితి ఎమ్మెల్యే నాయని నర్సింహ్మారెడ్డి, కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, ఎంపీలు వి హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్, సర్వే సత్యనారాయణ, టి సుబ్బరామిరెడ్డి, మంత్రులు జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, షబ్బీర్ అలీ, ఆర్ దామోదర్ రెడ్డి, టి.జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎం.సత్యనారాయణ, మర్రి శశిధర్ రెడ్డి, జి కిషన్ రెడ్డి, పద్మారావు, జి సాయన్న, చెన్నమనేని రాజేశ్వర్ రావు, మాజీ మంత్రి విజయరామారావు, ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచంద్రరావు, వేలాది మంది సహచరులు, కార్యకర్తలు , అభిమానులు కడసారి తమ నేత భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
తమ నేతను కడసారి చూసేందుకు అంబర్ పేట్ స్మశాన వాటికలోకి రావడానికి ప్రయత్నించిన వేలాదిమంది అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు. అభిమానులు దూసుకు రావడంతో పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. స్మశానవాటికలో ముఖ్యమంత్రి తదితరులు ఉండడంతో భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు వారిని లోపలికి అనుమతించలేదు. చివరగా హనుమంతరావు జోక్యం చేసుకుని మహిళలను అనుమతించాల్సిందిగా కోరడంతో పోలీసులు తొలుత మహిళలను లోనికి అనుమతించారు. ముఖ్యమంత్రి తదితరులు వెళ్లిపోయిన తరువాత అందరినీ లోపలికి అనుమతించారు. కడసారి తమ నేతను చూడడానికి ప్రవాహంలా లోపలికి దూసుకువచ్చారు. ఈ నేపథ్యంలో తోపులాట చోటుచేసుకుంది. కాగా నేతలంతా వెళ్లిపోయినా వి హనుమంతరావు, మర్రి శశిధర్ రెడ్డి తుది కంటా అక్కడే ఉన్నారు.












Click it and Unblock the Notifications
