సెక్స్ రాకెట్ లో షబ్బీర్ పాత్ర: తెరాస
హైదరాబాద్: చెన్నై సెక్స్ రాకెట్ తో విద్యుచ్ఛక్తి శాఖా మంత్రి షబ్బీర్ అలీకి పాత్ర ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రధాన కార్యదర్శి వి. ప్రకాశ్ ఆరోపించారు. తమ పార్టీ నేత కె. చంద్రశేఖర రావుపై షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలపై ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల వద్ద తీవ్రంగా ప్రతిస్పందించారు. ఆ రాకెట్ కు సంబంధించిన ఫైలును షబ్బీర్ అలీ తొక్కిపెట్టారని ఆయన అన్నారు. షబ్బీర్ అలీని వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అటువంటి వ్యక్తి మంత్రి వర్గంలో ఉండడానికి తగరని ఆయన అన్నారు.
షబ్బీర్ అలీ ఉదంతాల చిట్టాను కూడా తాము విప్పుతామని, ఇది చిన్నదేనని ఆయన అన్నారు. అప్పటి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ను పట్టుకుని టికెట్టు కోసం ఏమేం చేశారో తాము చెప్పగలమని ఆయన అన్నారు. తమ నేత కె. చంద్రశేఖర రావు చలువ వల్లనే షబ్బీర్ అలీకీ టికెట్ వచ్చి గెలిచారని ఆయన అన్నారు. రాజకీయ జీవితాన్ని ఇచ్చిన చంద్రశేఖర రావును గౌరవించడానికి బదులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. శాసనసభలో తెలంగాణపై జరిగిన చర్చను దారి మళ్లించడానికి షబ్బీర్ అలీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చడానికి షబ్బీర్ అలీ ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications
