భూమి వేడెక్కుతున్నా చలి చంపుతుంది. ప్రకృతిలో వింత పరిణామాలు..
ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్నోగ్రతలు క్రమంగా పెరుగుతూ, భూమి వేడెక్కుతుందనేది కాదనలేని సత్యం. అయితే, ఈ వేడి ప్రపంచమంతా ఒకేలా ఉండటం లేదు. సూర్యరశ్మి పడే తీరు, మేఘాల కమ్ముడుదల, వాతావరణ ప్రసరణ విధానాలు మరియు గాలిలో తేమ వంటి పలు అంశాల ఆధారంగా ప్రాంతాల వారీగా ఉష్ణోగ్రతల్లో భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ప్రపంచమంతా సగటు ఉష్ణోగ్రత పెరుగుతున్నప్పటికీ, కొన్ని ప్రాంతాలలో మాత్రం తీవ్రమైన చలిగాలులు, రికార్డు స్థాయి ఉష్ణోగ్రత పడిపోవడం వంటి విపరీత వాతావరణ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి.
ఉపగ్రహాల అధ్యయనంలో విస్మయకర నిజాలు
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,400 నగరాల్లో 2002 నుంచి 2021 వరకు జరిగిన శాస్త్రీయ అధ్యయనాలు కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాయి. మెజారిటీ నగరాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, చాలా తక్కువ నగరాల్లో మాత్రం పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం గమనించారు. దాదాపు 86 శాతం నగరాల్లో పగటివేళ, 96 శాతం నగరాల్లో రాత్రివేళ ఉష్ణోగ్రతలు పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కేవలం 3.9 శాతం ప్రాంతాలలో మాత్రమే పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గే ధోరణి కనిపించడం విశేషం.

ఒకవైపు మండిపోతున్న ఎండలు.. మరోవైపు గడ్డకట్టించే మంచు
ఈ ప్రాంతీయ వ్యత్యాసాలు గత జనవరి నెలలో స్పష్టంగా బయటపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా నమోదైనప్పటికీ, ఉత్తర గోళార్ధంలోని అనేక ప్రాంతాలు తీవ్రమైన చలికి వణికిపోయాయి. ఫిన్లాండ్‌లో ఉష్ణోగ్రత ఏకంగా మైనస్ 31.5 డిగ్రీలకు పడిపోగా, సైబీరియాలో మైనస్ 40 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. న్యూయార్క్‌లో భారీ హిమపాతం కురిస్తే, జపాన్ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నాలుగు దశాబ్దాల రికార్డును బద్దలు కొడుతూ భారీ మంచు కురిసింది. అదే సమయంలో ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలలో రికార్డు స్థాయిలో 49.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
భారత్‌తో పాటు కొన్ని ప్రాంతాల్లో తగ్గుతున్న పగటి ఉష్ణోగ్రతలు
ఈ పరిశోధనలో భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ - ఈశాన్య చైనాలోని కొన్ని నగరాల్లో పగటి ఉష్ణోగ్రతల పెరుగుదల చాలా తక్కువగా ఉండటంతో పాటు, కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు తగ్గుతున్నట్లు తేలింది. దీనికి ప్రధానంగా వాతావరణంలో పెరిగిపోతున్న కాలుష్య కణాలు (ఏరోసోల్స్) చెట్లు, మొక్కల పెంపకం వంటి అంశాలు కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే ధూళి కణాలు సూర్యరశ్మిని అడ్డుకోవడంతో పాటు, దట్టమైన చెట్లు విడుదల చేసే నీటి ఆవిరి ఆ ప్రాంతాలను చల్లబరుస్తుందని అధ్యయనంలో తేలింది. అయితే ఈ కాలుష్య కణాల వల్ల వాతావరణం చల్లబడినప్పటికీ, మానవ ఆరోగ్యానికి మాత్రం తీవ్ర ముప్పు వాటిల్లుతుంది.
మారుతున్న వాతావరణ పోకడలు.. ఎల్ నినో ప్రభావం
వాతావరణంలో సంభవించే ఎల్ నినో, లా నినా వంటి సహజ పరిణామాలు కూడా ప్రాంతీయ వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. నేల తేమ, మందపాటి మేఘాలు పగటిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరగకుండా అడ్డుకుంటాయి. ఏదేమైనా, కొన్ని ప్రాంతాలలో తాత్కాలికంగా చలి లేదా ఉష్ణోగ్రతల్లో తగ్గుదల కనిపించినప్పటికీ, భూమి సగటు ఉష్ణోగ్రత మాత్రం మొత్తంగా పెరుగుతూనే ఉంది. సముద్ర మట్టాలు పెరుగుతుండటం, ధ్రువ ప్రాంతాలలో మంచు కరిగిపోతుండటం భవిష్యత్తులో మానవాళికి పెను ముప్పుగా మారుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.














Click it and Unblock the Notifications
