అనూహ్య పారిశ్రామిక ప్రగతి: వైయస్
విజయవాడ: గత 20 ఏళ్లలో సాధించని పారిశ్రామిక ప్రగతిని వచ్చే రెండేళ్లలో సాధిస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. కృష్ణా జిల్లాలో ఆయన ఆదివారంనాడు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాల్సిందిగా ఆయన ప్రవాశ భారతీయులకు పిలుపునిచ్చారు. గంగవరం రైల్వే ఫ్లై ఓవర్ కు ఆయన శ్రీకారం చుట్టారు. వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ అస్పత్రికి శంకుస్థాపన చేశారు. జీవనక్రాంతి పథకానికి శ్రీకారం చుడుతూ లబ్ధిదారులకు గొర్రెలు, పొట్టేళ్లు పంపిణీ చేశారు. నర్సింగ్ పాఠశాల, దంత వైద్యకళాశాలల్లో అదనపు గదులను ప్రారంభించారు. పెట్టుబడులను ఆకర్షించడంలో గుజరాత్ రాష్ట్రం తర్వాత మన రాష్ట్రమే ముందంజలో ఉందని ఆయన చెప్పారు.
జూన్ నెల నుంచి తెల్ల రేషన్ కార్డులున్నవారందరికీ చౌకధరల దుకాణాల ద్వారా వంట నూనెలు, పప్పులు సరఫరా చేస్తామని ఆయన చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు ప్రారంభించిన రెడు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని తెలుగుదేశం రద్దు చేసిందని, దాన్ని తాము ఉగాది నుంచి ప్రారంభిస్తున్నామని ఆయన చెప్పారు. వచ్చే సంవత్సరానికల్లా మహిళలందర్ని లక్షాధికారుల్ని చేస్తామని ఆయన చెప్పారు. రైతులకు పావలా పడ్డీకే రుణాలు ఇస్తామని ఆయన చెప్పారు. రుణమాఫి పథకం వల్ల రైతులకు ఎన్నడూ లేని విధంగా ఊరట లభిస్తుందని ఆయన చెప్పారు. బలహీనవర్గాలవారు పరిశ్రమలు నెలకొల్పదలుచుకుంటే పావలా వడ్డీకే రుణాలిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications