పాక్ లో పేలుడు: 10 మంది మృతి
ఇస్లామాబాద్: మిలిటెంట్లు పెషావర్ లో పాకిస్తాన్ వైమానిక దళం బస్సుపై బాంబు దాడి జరపడంతో మంగళవారం పది మంది మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. కోహాట్ బ్రిడ్జిపై నుంచి పెషావర్ లోని స్థావరానికి వెళ్తుండగా బస్సుపై మిలిటెంట్లు దాడి జరిపారు. మృతులు, క్షతగాత్రులు ఎక్కువ మంది పాకిస్తాన్ వైమానిక దళానికి చెందినవారేనని అధికార వర్గాలు చెప్పాయి.
బాంబును బస్సులోనే పెట్టారా, వంతెనపై పెట్టారా అనేది ఇంకా తేలలేదు. వంతెనపై నుంచి బస్సు వెళ్తుండగా రిమోట్ కంట్రోల్ తో బాంబును పేల్చివేశారు. బాంబు అత్యంత శక్తివంతమైనది కావడంతో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. వంతెనకు పెద్ద రంధ్రం ఏర్పడింది. కార్లకు, మోటారు సైకిళ్లకు కూడా బాంబు పేలుడు తీవ్రత తాకింది. బస్సు పూర్తిగా ధ్వంసమైంది. గాయపడినవారిని పెషావర్ లోని ఆస్పత్రులకు తరలించారు. శవాలు గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయి.












Click it and Unblock the Notifications
