15 నుంచి కరెంట్ కోతకు స్వస్తి
హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ కోతకు ఈ నెల 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం నుంచి తెరపడనుంది. ఈ విషయాన్ని విద్యుచ్ఛక్తి మంత్రి షబ్బీర్ అలీ చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ పంపిణీపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మంగళవారం సచివాలయంలో సమీక్షించారు. ఈ సమీక్ష అనంతరం షబ్బీర్ అలీ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇటీవలి వరకు వర్షాలు లేకపోవడంతో రాష్ట్రంలో విద్యుత్ కోతను విధించారు. ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో రాష్ట్రంలోని రిజర్వాయర్లన్నీ జలాలతో కళకళలాడుతున్నాయి. దీంతో జలవిద్యుచ్ఛక్తి ఉత్పత్తి పెరిగే పరిస్థితులు వచ్చాయి.
శ్రీశైలం జల విద్యుత్కేంద్రంలో నిన్నటి నుంచి (సోమవారం నుంచి) విద్యుదుత్పత్తి ప్రారంభమైందని, నిన్న పీక్ హౌర్స్ లో 520 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరిగిందని షబ్బీర్ అలీ చెప్పారు. ఈ రోజు నుంచి 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని ఆయన చెప్పారు. శ్రీశైలం రిజర్వాయర్ లోకి 83 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని ఆయన చెప్పారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ రైతులకు నీరు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications
