జార్ఖండ్ సిఎంగా శిబూ సొరేన్?
న్యూఢిల్లీ: జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు శిబూ సొరేన్ జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తమ పార్టీ నాయకులతో జార్ఖండ్ లో సమావేశమైన అనంతరం స్వయంగా సొరేన్ మంగళవారం విలేకరులతో చెప్పారు. కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నస్వతంత్ర శాసనసభ్యుడు మధు కొడా దిగిపోయి తాను ముఖ్యమంత్రి పగ్గాలు చేపడుతానని జెఎంఎం నేత సొరేన్ చెప్పారు. మధు కొడా దిగిపోవడానికి నిరాకరిస్తే కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకుంటుందని ఆయన చెప్పారు. తనను ముఖ్యమంత్రి చేయాలనే నిర్ణయం ఎప్పుడో జరిగిందని, అయితే అది ఆలస్యమవుతూ వస్తున్నదని ఆయన చెప్పారు.
రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానవర్గం మధు కొడాను ఆదేశించిందని, మధు కొడా రాజీనామా చేసిన వెంటనే తాను ఆ పదవిని చేపడతానని ఆయన చెప్పారు. దీనికి తోడు కేంద్ర మంత్రి వర్గంలో తమ పార్లమెంటు సభ్యులకు రెండు మంత్రి పదవులు లభిస్తాయని ఆయన చెప్పారు. బలపరీక్ష సందర్భంగా యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినందుకు కాంగ్రెస్ శిబూ సొరేన్ కు ఇచ్చిన హామీ మేరకు ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజీనామాకు మధు కొడాకు ఇచ్చిన గడువును చెప్పడానికి ఆయన నిరాకరించారు. సాధ్యమైనంత త్వరగా మధు కొడా రాజీనామా చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.
అయితే తన పదవికి ఏ విధమైన ప్రమాదం లేదని మధు కొడా అంటున్నారు. తాను ముఖ్యమంత్రి కావడంలో ఆర్జెడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్, జెఎంఎం నేత శిబూ సొరేన్ అందించిన సహకారాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. శిబూ సొరేన్ ముఖ్యమంత్రి అవుతారనే వార్తలపై ఆయన స్పందిస్తూ దేనికైనా కాలం కలసి రావాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
