అభివృద్ధి పథంలో ప్రకాశం: వైయస్
ఒంగోలు: ప్రకాశం జిల్లా ప్రగతిపథంలో ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు సొరంగం పనులకు ఆయన మంగళవారం శ్రీకారం చుట్టారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే జిల్లా సస్యశ్యామలం అవుతుందని ఆయన చెప్పారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు ద్వారా 60, 70 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, అలాగే రామతీర్థ ప్రాజెక్టు పూర్తయిందని ఆయన చెప్పారు. జిల్లాకు చెందిన సాగునీటి ప్రాజెక్టులను అన్నింటినీ పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాలు ప్రకాశం జిల్లాను పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.
జిల్లాలో నౌకా కేంద్రం ఏర్పాటవుతోందని, విమానాశ్రయం కూడా వస్తుందని, దీని వల్ల ప్రకాశం జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని, ఫలితంగా ప్రకాశం జిల్లాలో నిరుద్యోగం అనే మాటనే వినిపించదని ఆయన అన్నారు. తాము ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బింది పడుతుంటే ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం అమలు చేస్తోందని, పప్పులు, మంచినూనెలను అందిస్తున్నదని ఆయన చెప్పారు. వివిధ వర్గాల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications
