ఉత్తరాదిలో వరదలు: 74 మంది మృతి
లక్నో: ఉత్తరాదిలో వరదలు ముంచెత్తటంతో ఇప్పటివరకు దాదాపు 74 మంది మరణించినట్టు ప్రాధమిక సమాచారం. భారీ వర్షాలవల్ల ఉత్తరాదిలో వరదలు సంభవించాయి. ఉత్తర ప్రదేశ్‌లో వర్షాల వల్ల అనేక చోట్ల గృహాలు కూలిపోయాయని పోలీసు శాఖ ప్రతినిధి సురేంద్ర శ్రీవాత్సవ చెప్పారు. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రమైన వారణాసిలో గత 24 గంటల్లో భారీ వర్షాలు పడ్డాయని తెలిపారు. ఈ వర్షాలు మరికొన్ని రోజులపాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లలో వర్షాలు పడుతున్నాయి. యమునా, సట్లెజ్, బియాస్ నదులు వరద నీటితో దిగువ ప్రాంతాలపై విరుచుకు పడుతున్నాయి. ఈ ప్రాంతాల్లో సహాయక సేవలను అధికారిక యంత్రాంగం ముమ్మరం చేసింది. పంజాబ్‌లో సట్లెజ్, బియాస్ నదులు వరద నీటితో పోటెత్తుతూ ముందుకు సాగుతున్నాయి. దీనితో జలంధర్, హోషియార్ పూర్ జిల్లాల్లో ముంపు ఏర్పడింది. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఉత్తరాదిలో వర్షాకాలం జూన్ నుంచి సెప్టెంబరు వరకూ ఉంటుంది.












Click it and Unblock the Notifications
