చిరుతో పార్టీల పునరాలోచన
హైదరాబాద్: చిరంజీవి రాజకీయం ఇతర పార్టీలను ఆలోచనలో పడేసిందని మంత్రి మారెప్ప అన్నారు. మదర్ థెరిస్సా, అంబేడ్కర్, ఫూలేలను ఆదర్శమూర్తులుగా ప్రకటించి బడుగు వర్గాలకు చిరంజీవి ప్రాధాన్యం ఇవ్వడంతో మిగతా పార్టీలు కూడా ఆలోచనలో పడ్డాయని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. చిరంజీవి సామాజిక న్యాయ సూత్రంపై ప్రజలు ఏకమైతే మంచిదేనని, ఎస్సీ, బిసి, ఎస్టీలకు మిగతా పార్టీలు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిన స్థితిలో పడ్డాయని ఆయన అన్నారు. తెలంగాణపై చిరంజీవి చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ గౌడ్ అన్నారు. నక్సలిజాన్ని సామాజిక సమస్యగా గుర్తిస్తున్నామని చెప్పడాన్ని కూడా ఆహ్వానిస్తున్నామని ఆయన అన్నారు.
చిరంజీవి తెలంగాణకు అనుకూలంగా ఏమీ ప్రకటన చేయలేదని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు గాదె వెంకట రెడ్డి అన్నారు. చిరంజీవి బహిరంగ సభ సినీ ఫక్కీలో బాగానే జరిగిందని విన్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో సినీ గ్లామర్ పనిచేయదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ అన్నారు. ఎన్టీ రామారావుకు కూడా తెలంగాణలో సినీ గ్లామర్ పై ఓట్లు పడలేదని ఆయన అన్నారు. చిరంజీవి సమసమాజాన్ని ఎలా స్థాపించదలుచుకున్నారనే విషయంపై స్పష్టత లేదని సిపిఐ శాసనసభా పక్ష నాయకుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. అయినా తాము రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయాన్ని ఆశిస్తున్నామని, చిరంజీవి విధానాలపై స్పష్టత వచ్చే వరకు వేచి చూస్తామని ఆయన అన్నారు. చిరంజీవి విధివిధానాలపై అప్పుడే ఒక నిర్ణయానికి రావడం సరైంది కాదని సిపిఎం శాసనసభా పక్ష నాయకుడు నోముల నర్సింహయ్య అన్నారు. పలు విషయాలపై చిరంజీవి ఇంకా తన వైఖరిని ప్రకటించాల్సి ఉందని ఆయన అన్నారు. చిరంజీవి వల్ల తమ కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన నష్టం లేదని మంత్రి టి. జీవన్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications
