బషీర్, నసీర్ ల పాత్రపై దర్యాప్తు
హైదరాబాద్: హైదరాబాద్ జంట పేలుళ్లలో ముఫ్తీ అబూ బషీర్ పాత్ర ఉందని రాష్ట్ర హోం మంత్రి కె. జానారెడ్డి ప్రకటన చేసిన నేపథ్యంలో కేసు దర్యాప్తు కొత్త మలుపు తిరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పేలుళ్ల అబూ బషీర్ పాత్రతో పాటు రియాజుద్దీన్ పాత్రపై కూడా హైదరాబాద్ పోలీసులు దృష్టి పెట్టారు. బషీర్ ను గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. గుజరాత్, బెంగుళూర్ పేలుళ్ల సూత్రధారి బషీరేనని పోలీసులు అనుమానిస్తున్నారు. నసీర్ ను కర్ణాటక పోలీసులు ఈ ఏడాది ఆరంభంలో అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదులోని లుంబినీ పార్కులో బాంబు పెట్టిన వ్యక్తి నసీరేనని అనుమానిస్తున్నారు.
హైదరాబాద్ జంట పేలుళ్లలో ప్రధాన సూత్రధారి కాకపోయినా బషీర్ ఇందుకు సంబంధించి కీలకమైన సమాచారం ఇవ్వగలడని పోలీసులు భావిస్తున్నారు. తీవ్రవాద దాడులకు శిక్షణ ఇచ్చేందుకు తాను హైదరాబాదులోనూ, కర్ణాటకలోనూ నిధులు సేకరించినట్లు బషీర్ అంగీకరించాడు. 2006, 2007 మధ్యకాలంలో హైదరాబాదులోని మదర్సాలో పనిచేసిన బషీర్ దాడికి ఇతరులతో కలిసి ప్రణాళిక సిద్ధం చేసి ఉండవచ్చునని అనుకుంటున్నారు. హైదరాబాద్ పోలీసులు బషీర్ ను విచారించారు కూడా. అయితే హైదరాబాద్, బెంగుళూర్ పేలుళ్లకు సంబంధించి అతను ఏమీ చెప్పలేదు.
బషీర్ ను మరోసారి విచారించాలని హైదరాబాదు పోలీసులు అనుకుంటున్నారు. నసీర్ పాత్రపై కూడా పోలీసులు దృష్టి పెడుతున్నారు. అయితే హైదరాబాద్ పోలీసులు ఇప్పటి వరకు నిర్దిష్ట సాక్ష్యాధారాలను సంపాదించలేకపోయారు. లుంబినీ పార్కుకు తాను నల్లటి సంచిని తీసికెళ్లినట్లు నసీర్ నార్కో ఎనాలిసిస్ పరీక్షలో చెప్పాడు. సంచిని పెట్టి తాను అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పాడు. ఇదిలా వుంటే సాబర్మతి జైలు నుంచి పాకిస్తాన్ కు ఫోన్ కాల్ వెళ్లిన విషయాన్ని నిఘా సంస్థ అధికారులు ఆంధ్ర పోలీసుల దృష్టికి తెచ్చారు. హీరేన్ పాండ్యా హత్య కేసులో నిందితుడైన హైదరాబాదుకు చెందిన మౌలానా నసీరుద్దీన్ సాబర్మతి జైల్లో ఉంటున్నాడు. మౌలానా నసీరుద్దీన్ ఇంటిపై పోలీసులు దాడి చేసి కొన్ని సిడీలను స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు నసీర్ కుమారుడు జబీర్ తీసికెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications
