చిరంజీవికి వైయస్ సవాల్
హైదరాబాద్: అవినీతి ఎక్కడ ఉందో నిరూపించాలని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని సవాల్ చేశారు. ఒక ప్రైవేట్ టీవీ చానెల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ సవాల్ విసిరారు. ఏదో విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం వారికి గానీ, కొత్తగా వచ్చే పార్టీకి గానీ ప్రభుత్వాన్ని విమర్శించక తప్పదని, విమర్శ కోసమే విమర్శ చేస్తున్నారని ఆయన అన్నారు.
ప్రజల ఆస్తులకు ప్రభుత్వం ధర్మకర్తగా వ్యవహరించాలనే చిరంజీవి వ్యాఖ్యపై కూడా ముఖ్యమంత్రి తీవ్రంగా ప్రతిస్పందించారు. తమకు ఆ విషయం తెలుసునని, తమకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. నిరర్థకమైన, ఆక్రమణకు గురయ్యే భూములను అమ్మి సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెడుతున్నామని ఆయన అన్నారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, ఇంత పెద్ద మొత్తం ప్రాజెక్టులకు ఖర్చు పెట్టగలమని ఎవరైనా ఊహించారా అని ఆయన అన్నారు. కలలు కనడానికి కూడా ధైర్యం కావాలని ఆయన అన్నారు.
గతంలో ప్రాజెక్టుల్లో అవినీతిపై తెలుగుదేశం పార్టీ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేయించి, చీవాట్లు తిన్నదని ఆయన గుర్తు చేశారు. ఇది ప్రజాప్రయోజనాల వ్యాజ్యంలా లేదు, ప్రైవేట్ ప్రయోజనాల వ్యాజ్యంలా ఉంది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ గానీ, కొత్తగా వచ్చే పార్టీ గానీ ప్రభుత్వంపై విమర్శలు చేయక ఇక ఎవరిపై విమర్శలు చేస్తారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
