అసెంబ్లీ: జలయజ్ఞంపై విపక్షాల వాకౌట్
హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి తలపెట్టిన జలయజ్ఞంపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇచ్చిన సమాధానానికి సంతృప్తి చెందని తెలుగుదేశం, సిపిఎం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), బిజెపి సభ్యులు గురువారం శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. జలయజ్ఞంలో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు విమర్శించాయి. మంత్రి పొన్నాల లక్ష్మయ్య సభను తప్పు దోవ పట్టిస్తున్నారని తెలుగుదేశం సభ్యుడు కడియం శ్రీహరి విమర్శించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా తెలుగుదేశం సభ్యులు స్పీకర్ పోడియం వైపునకు దూసుకెళ్లారు.
తనకు గానీ, ప్రభుత్వానికి గానీ సభను తప్పు దోవ పట్టించాల్సిన అవసరం లేదని, దేవాదుల నిర్మాణం పూర్తయిందని, ధర్మసాగర్ కు నీళ్లు అందించడమే మిగిలిందని మంత్రి చెప్పారు. అలీసాగర్, గుత్ప ప్రాజెక్టుల ద్వారా కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వడం లేదని, కానీ 14 లక్షల ఎకరాలకు నీరిస్తామని ప్రభుత్వం చెబుతోందని, ఈ ప్రాజెక్టు ద్వారా ఆయకట్టు స్థిరీకరణ మాత్రమే జరుగుతుందని కడియం శ్రీహరి చెప్పారు. జలయజ్ఞం ఫైళ్లను అఖిల పక్షం ముందుంచాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.












Click it and Unblock the Notifications
