టిడిపికి తమ్మినేని సీతారాం రాజీనామా
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి మాజీ మంత్రి తమ్మినేని సీతారాం గురువారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన పార్టీ నాయకత్వానికి పంపి, ఆయన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి చేరుకున్నారు. పార్టీ నాయకత్వానికి ఆయన 50 పేజీల లేఖ రాశారు. ప్రజారాజ్యం పార్టీలో ఆయన చేరిక లాంఛనమే. తెలుగుదేశం పార్టీపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీఆర్ ఏ ఆశయాలతోనైతే పార్టీని స్థాపించారో ఆ ఆశయాలను తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వమ్ము చేసిందని ఆయన విమర్శించారు.
తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఎర్రంనాయుడిపై చర్యలు తీసుకోవడంలో పార్టీ నాయకత్వం అలసత్వం ప్రదర్శించిందని ఆయన విమర్శించారు. నిబద్ధతతో, విలువల పరిరక్షణ కోసం పార్టీలో అరాచక శక్తులను అరికట్టాల్సి ఉంటుందని, తెలుగుదేశం పార్టీలో ఆ పని జరగడం లేదని ఆయన విమర్శించారు. తమ్మినేని సీతారాంను ఆపడానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రజారాజ్యంలోకి వెళ్లకుండా నిరోధించేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి బుధవారం సీతారాంతో చర్చలు జరిపారు. ఆ చర్చలు ఫలించలేదు.












Click it and Unblock the Notifications
