శీను హత్య ప్రభుత్వ కుట్రే: బాబు
హైదరాబాద్ : ఒక పథకం ప్రకారమే మొద్దుశీనును హత్య చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఎలాంటి దర్యాప్తు లేకుండానే శీను హత్యకు గురయ్యాడని ప్రకటించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్యారక్‌లో ఉన్న ఆధారాలన్నింటిని తుడిచివేశారని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. మొద్దు శీను హత్య విషయం తెలిసిన వెంటనే ఆయన పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. హత్యలు చేయడానికి , నేరస్థులను కాపాడటానికే ప్రభుత్వం ఉందని ఆయన నిప్పులు చెరిగారు. జైలులో ఉన్న ఖైదీ హత్యకు గురికావడం ఇదే ప్రథమమని ఆయన తెలిపారు.ముఠానాయకులకు రాజకీయాధికారం వస్తే ఎలావుంటుందో అర్థమవుతోందని ఆయన విమర్శించారు.
శీనును సహచరఖైదీ కొట్టిచంపుతుంటే జైలు సిబ్బంది ఏంచేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. శీను హత్యకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి , హోంమంత్రిలు తక్షణమే రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీబీఐపై కూడా నమ్మకం లేదని దీనిపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని ఆయన కోరారు. పరిటాల రవి హత్య కేసులో ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కొడుకు, జేసీ దివాకరరెడ్డిల పాత్ర ఉందని తాము పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పరిటాల రవి హత్య కేసులో సాక్ష్యాధారాలన్నింటినీ రూపుమాపడానికే ఈ చర్యకు ప్రభుత్వం దిగిందని ఆయన అన్నారు. అప్రూవర్ గా మారుతానని మొద్దు శీను అన్నప్పుడు సిబిఐ అంగీకరించి ఉంటే ఈ హత్య జరిగి ఉండేది కాదని ఆయన అన్నారు. పరిటాల రవిది ప్రభుత్వ హత్యేనని, ఈ హత్యలో పాల్గొన్నవారిని ఒక్కొక్కరినే మట్టు పెట్టి ఆధారాలు లేకుండా చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
