ప్రభుత్వంపై ప్రతిపక్షాల ధ్వజం
హైదరాబాద్: మొద్దు శీను హత్యపై ప్రతిపక్షాలు తీవ్రంగా ధ్వజమెత్తాయి. మొద్దు శీను హత్య ప్రభుత్వ పెద్దల కుట్రేనని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు విమర్శించారు. ఈ హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మొద్దు శీను అప్రూవర్ గా మారితే పరిటాల హత్య కేసులో నిజాలు బయటపడతాయని ప్రభుత్వ పెద్దలే ఈ హత్య చేయించారని ఆయన ఆరోపించారు. మొద్దు శీను హత్య పెద్ద కుట్ర లాగే కనిపిస్తోందని సిపిఎం కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. మొద్దు శీను హత్యపై ఉన్నత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. జైలు అధికారుల ప్రమేయం లేకుండా ఈ హత్య జరిగి ఉండదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
మొద్దు శీను హత్యతో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఫాక్యనిస్టు తత్వం మరోసారి బయటపడిందని బిజెపి నాయకుడు సిహెచ్ విద్యాసాగరరావు కరీంనగర్ లో అన్నారు. మొద్దు శీను హత్యకు ప్రభుత్వ సహకారం ఉందని ఆయన అన్నారు. హత్యపై న్యాయవిచారణ జరిపించి బాధ్యులైనవారిని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మొద్దు శీను హత్యపై హోంమంత్రి కె. జానారెడ్డి స్పందన స్పందన అస్పష్టంగా ఉందని ప్రజారాజ్యం అధికార ప్రతినిధి పరకాల ప్రభాకర్ అన్నారు. హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొద్దు శీను హత్య జైళ్లలో భద్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు.
అనంతపురం జైలులో మొద్దుశీను హత్యకు గురికావడం ప్రభుత్వ,నిఘావర్గాల వైఫల్యమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆరోపించారు. సామాన్యులకు బాహ్యప్రపంచంలో , ఖైదీలకు జైలులో రక్షణ లేకుండా పోయిందని ఆయనన్నారు. హత్యపై ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకునేందుకు ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications
