న్యూఢిల్లీ: ఎయిమ్స్ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న వాజపేయిని శనివారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పరామర్శించారు. వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ వైద్యులతో ఆమె చర్చించారు. డాక్టర్లను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, వాజపేయి త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. దేశం గర్విచదగిన నేతల్లో వాజపేయి ఒకరని సోనియా కితాబిచ్చారు. ఛాతి ఇన్‌ఫెక్షన్‌తో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన వాజపేయి ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు వైద్యులు ప్రకటించడం తెలిసిందే. దీనితో వాజపేయిని కాంగ్రెస్ సహా అన్ని పార్టీలకు చెందిన నేతలూ పరామర్శిస్తున్నారు. మరోపక్క నాగపూర్ జాతీయ సమావేశంలో పాల్గొన్న బిజెపి అగ్రనేతలు కూడా ఎప్పటికప్పుడు వాజపేయి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తున్నది.