గాంధీభవన్ ఘటనలో మరొకరి మృతి
హైదరాబాద్: గాంధీభవన్‌పై ఎమ్మార్పీఎస్ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్పెషల్ పోలీస్ ఆఫీసర్ కె.సుబ్రమణ్యం రాజు (40) మృతి చెందారు. బుధవారం మధ్యాహ్నం ఆయన చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. రాజు మరణవార్త తెలిసిన వెంటనే బంధువులు, స్నేహితులు, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు, ప్రభుత్వ నేతలు ఆస్పత్రికి చేరుకొన్నారు. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు ప్రయత్నించారు. రాజు కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని హోంమంత్రి జానారెడ్డి హామీ ఇచ్చారు.
ఈనెల 1వ తేదీన సుబ్రమణ్యంరాజు విధి నిర్వహణలో భాగంగా గాంధీభవన్‌లో భద్రతా విధులు నిర్వహిస్తున్న సమయంలో.. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ వైఖరికి నిరసనగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పెట్రోల్, డీజిల్‌తో దాడి చేశారు. ఆ సమయంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను అడ్డుకునే క్రమంలో.. రాజు దుస్తులపై పెట్రోల్, డీజిల్ చిందింది. వాటికి నిప్పంటుకుని తీవ్రంగా గాయపడ్డారు.
98శాతం కాలిన గాయాలతో కాంచన్‌బాగ్ అపోలో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ సుబ్రమణ్యంరాజు బుధవారం మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో తుదిశ్వాస వదిలారు. ఈ దాడిలో పాల్గొని తీవ్రంగా గాయపడిన ఎమ్మార్సీఎస్ నాయకుడు సురేందర్ మాదిగ కూడా మృతి చెందిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications