గుంటూరు: ప్రత్యేక తెలంగాణ విషయంలో తన వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణపై తాను అన్న మాటలు తప్పు అని కేసీఆర్ చేత చంద్రబాబు నాయుడు చెప్పించగలరా అని వైఎస్ ప్రశ్నించారు. ఇవే వ్యాఖ్యలు కేసీఆర్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఎందుకు మౌనం వహించారని ఆయన నిలదీశారు. తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్రులను తరిమికొడతామని, ఆంధ్ర ప్రాంతం వారు నిర్వహిస్తున్న విద్యా, వ్యాపార సంస్థలను మూసివేయిస్తామని, ఆంధ్ర ప్రాంతం వాళ్ళను బొంద పెడతామని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, ప్రకటనలు సక్రమమే అని ఎవరైనా సమర్ధించగలరా అని వైఎస్ ప్రస్తావించారు. 'ఆంధ్రా భోజనం' అనే బోర్డు ఉంటే తెరాస వారు దాడులు చేసిన వైనాన్ని మరిచిపోతే ఎలా అని ఆయన నిలదీశారు. అలాంటి విపరీత చర్యలకు పాల్పడిన కేసీఆర్ ఆంధ్రులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్ డిమాండ్ చేశారు.