'డీలిమిటేషన్' పై జగన్ అనూహ్య నిర్ణయం - ఢిల్లీ కేంద్రంగా, కొత్త లెక్కలు..!!
ఢిల్లీ కేంద్రంగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం ప్రతిష్ఠాత్మక బిల్లులను ప్రవేశ పెట్టేందుకు సిద్దం అయింది. గత అనుభవాలతో నెంబర్ గేమ్ కు సిద్దమైనట్లు కనిపిస్తోంది. ఎన్డీఏ పార్టీలతో పాటుగా కలిసి వచ్చే పార్టీల మద్దతు సమీకరిస్తోంది. ఈ సమయంలోనే మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఎంపీలకు ఇదే అంశం పైన స్పష్టత ఇస్తున్నారు.
కేంద్రం కీలక బిల్లులకు సిద్దం అవుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల తో పాటుగా డీలిమిటేషన్ బిల్లు ఆమోదం దిశగా తుది కసరత్తు చేస్తోంది. గత సమావేశాల్లో ఈ బిల్లు వీగిపోవటంతో మద్దతు కు కావాల్సిన సంఖ్య సమీకరణతో సమాయత్తం అవుతోంది. ఈ క్రమంలో దక్షిణాది పార్టీల మద్దతు కీలకంగా మారుతోంది. కాగా.. ఈ బిల్లు పైన పార్టీ ఎంపీలకు మాజీ సీఎం జగన్ ఈ రోజు జరిగే సమావేశంలో దిశా నిర్దేశం చేయనున్నారు.

గతంలో బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన సమయంలో వైసీపీ తమ వైఖరి స్పష్టం చేసింది. బిల్లుకు మద్దతు ఇస్తూనే.. ఈ అంశం పైన నెలకొని ఉన్న అనుమానాలను క్లియర్ చేయాలని సూచించింది. బిల్లు వీగిపోవటం పైన నాడు జగన్ సైతం తన వైఖరి ఏంటో తేల్చి చెప్పారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను వ్యతిరేకించిన ప్రతిపక్ష పార్టీలు ఏం సాధించాయో ప్రశ్నించుకోవాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో పరిస్థితుల పైన పార్లమెంట్ లో ప్రస్తావన
అదే సమయంలో లోక్ సభలో పార్టీ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి కీలక అంశాలను ప్రస్తావించారు. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్‌పై ప్రభుత్వం చెబుతున్న అంశాలను లిఖితపూర్వకంగా బిల్లులో పొందుపరచాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాంతీయ అసమానతలు లేకుండా సమతుల్యంగా నియోజకవర్గాల పెంపు జరగాలని, అన్ని రాజకీయ పార్టీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేలా ప్రక్రియ ఉండాలని సూచించారు. విపక్షాలను అణచివేసే విధంగా డీలిమిటేషన్ ఉండకూడదని స్పష్టం చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. ఇక.. ఇప్పుడు మారుతున్న లెక్కలతో తమ ఎంపీలకు జగన్ కీలక దిశా నిర్దేశం చేయనున్నారు. కేంద్ర బిల్లులకు వైసీపీ మద్దతు ఇవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో ఈ సమావేశాల్లో ఏపీకి సంబంధించిన అంశాల పైనా ఎంపీలకు జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన పార్లమెంట్ లో ప్రస్తావించేలా ఎంపీలకు జగన్ సూచనలు చేయనున్నారు.












Click it and Unblock the Notifications