తిరుపతి: చిరంజీవి పోటీ చేస్తున్న తిరుపతి అసెంబ్లీ స్ధానంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరి కొద్ది గంటల్లో పోలింగ్ జరుగబోతుండగా ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు తిరుపతిలో ఘర్షణ పడ్డారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పీఆర్పీ కార్యకర్తలు ఎన్నికల నిబంధలకు విరుద్ధంగా డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తూ తిరుపతిలోని కెన్సెన్ హోటల్ ముందు ధర్నాకు దిగారు. పీఆర్పీ అధినేత చిరంజీవి కూడా ఇదే హోటల్‌లో బస చేస్తున్నారు. కొందరు పీఆర్పీ కార్యకర్తలు కాంగ్రెస్ ధర్నాను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఫలితంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీఛార్జి చేశారు.