బెంగుళూర్: కేంద్రంలో తమ తృతీయ కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రం ఇస్తామని జెడి (ఎస్) నేత దేవెగౌడ హామీ ఇచ్చారు. తృతీయ ఫ్రంట్ అజెండాలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం ఉందని ఆయన చెప్పారు. ఒక తెలుగు ప్రైవేట్ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం చెప్పారు. తెలంగాణ కోసం తాము ఏ పార్టీతోనైనా జత కట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చేసిన ప్రకటన నేపథ్యంలో దేవెగౌడ హామీకి ప్రాధాన్యం ఉంది. కేంద్రంలో తృతీయ ఫ్రంట్ అధికారంలోకి రావడానికి అవకాశాలున్నాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్, బిజెపిలు ల్యాండ్ మాఫియా చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయని ఆయన విమర్శించారు. కాంగ్రెసు, బిజెపిల బలాలు క్రమేణా క్షీణిస్తున్నాయని ఆయన అన్నారు. ఆ రెండు పార్టీలు త్వరలోనే కనుమరగువుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.