బాలకృష్ణనే అంగీకరించారు: సోమిరెడ్డి
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును విమర్శిస్తూ లేఖాస్త్రాలు సంధిస్తున్న తిరుగుబాటు నాయకుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అభ్యర్థి అని బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ చెప్పారని, అప్పుడెందుకు ప్రసన్నకుమార్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదని ఆయన అన్నారు. చంద్రబాబుపై మాట్లాడడానికి నువ్వెంత అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలు ముగిసిన నెల తర్వాత విమర్శలు చేయడంలో అర్థమేమిటని ఆయన అడిగారు. ఏనుగు నడుస్తుంటే కుక్కలు మొరుగుతాయని, అలాగే ప్రసన్నకుమార్ రెడ్డి వ్యవహారం ఉందని ఆయన అన్నారు.
ప్రసన్న కుమార్ రెడ్డి మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నారని, ప్రసన్నకుమార్ రెడ్డి మానసిక పరిస్థితి బాగా లేదని ఆయన సోదరుడు రాజేంద్రకుమార్ రెడ్డే చెప్పారని చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పార్టీ నుంచి కోటగిరి విద్యాధరరావు, తమ్మినేని సీతారాం లాంటి వాళ్లు వెళ్లిపోయారని, వారెవరు కూడా ప్రసన్నకుమార్ రెడ్డిలా మాట్లాడలేదని ఆయన అన్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి ఎందుకు అలా మాట్లాడుతున్నారనేది బహిరంగ రహస్యమేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications