విశాఖపట్నం: ఉత్తర ఒరిస్సా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి అక్కడే స్థిరంగా వుంది. రానున్న 24 గంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం వుందని విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం అధికారి ఒకరు తెలిపారు. ఒరిస్సా నుంచి కోస్తా మీదుగా దక్షిణ ఒరిస్సా వరకు తీరం వెంబడి ఉపరితలద్రోణి బలంగా వుంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఒరిస్సాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తరకోస్తా, తెలంగాణ, విదర్భలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయి.
తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ పరిశోధనా కార్యాలయం అధికారులు చెప్పారు. మత్స్యకారులెవరూ వేట కోసం సముద్రంలోకి వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు.