హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నైతికంగా ఓడిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఓడినట్లేనన్నారు. 64 శాతం మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రభుత్వం ఈ సంగతి గుర్తెరిగి మసలుకోవాలని సూచించారు. శేరిలింగంపల్లి నుంచి ప్రరాపా తరఫున శాసనసభకు పోటీచేసిన బండి రమేష్, అదే నియోజకవర్గానికి చెందిన తెరాస నేత శంకర్ గౌడ్ లు ఆదివారం ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్-మజ్లిస్ కలిసి రాజధానిని నాశనం చేశాయి, ఆ రెండూ తోడుదొంగలేనని విమర్శించారు. ప్రజా సమస్యలను పట్టించుకోని ఈ ప్రభుత్వానికి గ్రేటర్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కందిపప్పు ధర విపరీతంగా పెరిగిపోతే..నియంత్రించాల్సిన ముఖ్యమంత్రే చేతులెత్తేశారని, 4 నెలల తర్వాత అవే తగ్గుతాయని బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని దుయ్యబట్టారు.