గూడు వదలి, గుండె చెదిరి...

వరదలకు కర్నూలు జిల్లా పిట్టలా వణికిపోయింది. ఈ జిల్లాలో 27 మంది దాకా మృతి చెందినట్లు సమాచారం. మొత్తం 34 గ్రామాలు వరదల మధ్య చిక్కుకున్నాయి. పంటనష్టం 60 వేల హెక్టార్లకు పైనే ఉంటుందని అంచనా. వరద బాధితులు 5 లక్షల మంది దాటారు. 50 వేలకు పైగా ఇళ్లు దెబ్బ తిన్నాయి. కర్నూలు, మంత్రాలయాల్లో ఆదివారంనాడు వరదలు తగ్గు ముఖం పట్టినప్పటికీ కుందూ నది పొంగి పొర్లడంతో నంద్యాల వరదతాకిడికి గురైంది. నంద్యాల పట్టణంలో నీరు చేరి ప్రజలు పైకప్పులపైకి ఎక్కి ప్రాణాలు దక్కించుకునే ప్రయత్నం చసారు. జిల్లాలోని పలు గ్రామాలు ఇప్పటికీ నీటిలోనే ఉన్నాయి.
కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల్లో వరద బీభత్సాన్ని అనూహ్యంగా చవి చూడడంతో కృష్ణా జిల్లాలో ప్రజలను కాపాడడంలో అధికారులు ముందు జాగ్రత్తతో వ్యవహరించారు. బలవంతంగా కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా తరలించారు. జిల్లాలో ఒకరు గల్లంతైనట్లు సమాచారం. పంట నష్టం 20 వేల హెక్టార్లకు పైనే ఉంటుంది. దాదాపు 80 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. జిల్లాలో మూడు లక్షలమందికి పైగా పునరావాస కేంద్రాలకు తరలిపోయారు. కృష్ణా నది ధాటికి గుంటూరు జిల్లా కూడా వణికిపోయింది. గుంటూరు జిల్లాలోని 109 గ్రామాలకు ముప్పు పొంచి ఉందని సమాచారం. 73 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా, నల్లగొండ జిల్లాలోని కృష్ణా పరీవాహక ప్రాంతాలు కూడా భయం గుప్పిట్లో కాలం గడిపాయి. జిల్లాలో ముగ్గురు మృత్యువాత పడినట్లు సమాచారం. మేళ్లచేర్వు, మఠంపల్లి, నేరేడుచర్ల, తదితర మండలాల్లోని గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయి. మిగతా జిల్లాలతో పోల్చుకుంటే ఈ జిల్లాలో నష్టం తక్కువగా ఉంది.












Click it and Unblock the Notifications